రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన దీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన దీక్షలు

దున్నపోతు మీద వర్షం పడ్డట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. యాసంగి వడ్లు కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‎ను చాలాసార్లు కలిశామని.. అయినా ఫలితం లేదని ఆయన అన్నారు. వడ్ల కొనుగోలు విషయంపై మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‎లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

‘ఆహరభద్రతా చట్టం కింద ఏ రాష్ట్రానికి చెందని వడ్లనైనా ఎఫ్‎సీఐ కొనాల్సిందే. రా రైస్, పారాబాయిల్డ్ రైస్ అని రైతులకు నిబంధనలు పెట్టొద్దు. అయినా వారి పోకడ మారలేదు. కేంద్రంలో ఉన్నది మూర్ఖ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతుల పట్ల దయ, ప్రేమ లేని ప్రభుత్వం ఇది. కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ.. రైతులను పట్టించుకోవడంలేదు. కేంద్రం తీరును రైతులకు తెలిపి.. వడ్లు వేయొద్దని కోరాం. కానీ, బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వడ్లు వేయించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రిని నమ్మొద్దన్నారు. కేంద్రంతో యాసంగి వడ్లు కొనిపించే బాధ్యత తమదేనన్నారు. కేంద్రలో ఉన్న ఢిల్లీ బీజేపీ కరెక్టా.. రాష్ట్రంలో ఉన్న సిల్లీ బీజేపీ కరెక్టా? లోకల్ పిచ్చి బీజేపీ నాయకులు మాట్లాడేదానికి తలా తోక లేదు. పీయూష్ గోయల్ ని డైరెక్ట్ గా అడుగుతున్న. తెలివి తక్కువ వారు ఎవరు. తెలంగాణ రైతా, తెలంగాణ ప్రభుత్వమా? మీ బండి సంజయ్, పనికిమాలిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలివి తక్కువ వాళ్లు. వీళ్లను వదిలేది లేదు.  గ్రామ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో వడ్లు కొనాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు. అందుకే మేం ఉద్యమ కార్యచరణకు నిర్ణయించాం. అందులో భాగంగా 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయబోతున్నాం. ఆ తర్వాత 6వ తేదీన నాలుగు జాతీయ రహదారులపై నిరసన రాస్తోరోకో ప్రోగ్రాం నిర్వహించబోతున్నాం. నాగపూర్- బెంగుళూరు- విజయవాడ- ముంబై హైవేపై ఆందోళనలకు దిగుతాం. అనంతరం 7వ తేదీన 32జిల్లాలోని జిల్లా కేంద్రాల్లో మంత్రుల, ఎమ్మెల్యేల సమక్షంలో నిరసనలు చేస్తాం. 8వ తేదీన ప్రతి గ్రామంలో ప్రతి రైతు తమ ఇంటి మీద నల్ల జెండా ఎగరవేసి.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగులబెట్టాలి. ఆ తర్వాత 11వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తాం. కేంద్రం తన వైఖరి మార్చుకునేంతవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రైతులను, పార్లమెంటును తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రి మీద ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇస్తాం’ అని కేటీఆర్ హెచ్చరించారు.