తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం: కేటీఆర్

తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం: కేటీఆర్

తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మే 6వ తేదీ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో సంగీత దర్శకడు ఇళయరాజాతో కలిసి 'మ్యూజిక్ స్కూల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇళయరాజాతో వేదిక పంచుకోవడం చాలా గౌరవంగా ఉందన్నారు కేటీఆర్. ఈ సినిమా దర్శకుడు ఐఏఎస్ పాపారావుతో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం విధానాల రూపకల్పనలో పాపారావు భాగస్వామ్యం ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్.

ఐఏఎస్ పాపారావు సినిమా తీశానని చెప్పగానే ఆశ్చర్యపోయానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సైన్స్, టెక్నాలజీ అనేదే చదువు కాదని చెప్పడానికి పాపారావు ఈ మ్యూజిక్ స్కూల్ సినిమా తీశారని వెల్లడించారు. ఇక ఇళయరాజా మ్యూజిక్ యూనివర్శిటీ లాంటి వ్యక్తి అని.. ఆయన అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.

ఈ మేరకు స్పందించిన ఇళయరాజా.. " తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటుకు నేను ఒప్పుకుంటాను. కేటీఆర్ ప్రజలకు ఎంతో చేస్తున్నారు. ప్రజలు వచ్చి రాజును ఏం కావాలో అడిగేవారు..మంత్రి వచ్చి ప్రజలను అడిగితే వద్దంటారా..నా పేరు ఇళయరాజానే అయినా నేను ప్రజల్లో ఒక్కడిని. మ్యూజిక్ నేర్చుకున్న ప్రాంతంలో వైలెన్స్ ఉండదు.. ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటైతే నాలాంటి చాలా మంది తయారవుతారు. ప్రపంచ దేశాల్లో మన దేశం నుంచి వెళ్లి చాలా మంది ప్రతిభ చూపిస్తున్నారు" అని ఇళయరాజా అన్నారు.

మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఇళయరాజా అంగీకరించినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.