ఢిల్లీ నుంచి మునుగోడుకు వందల కోట్లు వచ్చాయి : కేటీఆర్

ఢిల్లీ నుంచి మునుగోడుకు వందల కోట్లు వచ్చాయి : కేటీఆర్

మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మునుగోడులో అభివృద్ధి, ఆత్మగౌరానికి పట్టంకట్టి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేసి కమ్యూనిస్టులకు ధన్యవాదాలు చెప్పారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందన్నారు.  మొత్తం జిల్లాలోని 12 స్థానాలకుగానూ 12 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించామని స్పష్టం చేశారు. 

బీజేపీ ఢిల్లీ బాసులకు మునుగోడు తీర్పు చెంపపెట్టులాంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు. డబ్బు, అధికారం, అహంకారంతో బలవంతంగా ఉప ఎన్నికను తీసుకొచ్చారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి మునుగోడుకు వందల కోట్లు రూపాయలను సంచుల్లో తీసుకొచ్చి అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నించారని తెలిపారు. ఉప ఎన్నికను ధనమయం చేయాలని..ప్రజల గొంతను నొక్కాలని ప్రయత్నం చేసినా ప్రజలు దాన్ని తిప్పికొట్టాలరన్నారు. కుట్రలు, కుతంత్రాలు, ఫేక్ ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. కారును పోలిన గుర్తులకు 6 వేల ఓట్లు వచ్చాయని..లేకుంటే తమ అభ్యర్థికి 16 వేల ఓట్ల మెజార్టీ వచ్చేదన్నారు. డబ్బు, అధికారం, అహంకారంతో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేశారని ఆరోపించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లో తెలంగాణపై కూడా కౄరమైన రాజకీయ క్రీడకు తెరలేపారని ఆగ్రహం  వ్యక్తం చేశారు.