కేటీఆర్ చొరవతోనే హైదరాబాద్‌‌కు ఐటీ కంపెనీలు

కేటీఆర్ చొరవతోనే హైదరాబాద్‌‌కు ఐటీ కంపెనీలు

హైదరాబాద్: టీఆర్ఎస్ వచ్చాకే కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌‌కు ఐటీ కంపెనీలు వచ్చాయని సినీ దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. అంతకుముందు హైదరాబాద్‌‌లో ఒక్క మైక్రోసాప్ట్ కంపెనీ మాత్రమే ఉండేదన్నారు. వరదలు వచ్చినప్పుడు గత ప్రభుత్వాల తప్పు అని చేతులు దులుపుకోకుండా.. సమస్యలను ఎలా పరిష్కరించాలనే దాని గురించి టీఆర్ఎస్ సర్కార్ ఆలోచించి ముందుకెళ్లిందని తెలిపారు. వరద పరిస్థితులను సీఎం కేసీఆర్, కేటీఆర్ బాగా మానిటర్ చేశారని పేర్కొన్నారు.

‘పాతబస్తీ అంటే అదేదో ప్రమాదకరం అనేలా చిత్రీకరించారు. కానీ అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎవరు ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారో.. ఎవరు అభివృద్ధి కోసం యత్నిస్తున్నారనేది ప్రజలు ఆలోచించాలి. శాంతియుత హైదరాబాద్ కావాలి కానీ మత కల్లోల్ల హైదరాబాద్ మాత్రం కాదు. నేనూ హిందువునే. ఒకాయన నాది హిందూ పార్టీ అని చెబుతున్నాడు. నేను ఆయన పార్టీలోనే ఉండాలా? లేకపోతే నన్నేం చేస్తారు? హిందువులు-ముస్లింలు అంటూ మనుషులను విడదీయకండి. మీరు మాట్లాడేది ఆవు పాలు తాగే మాటలు కాదు.. వేదాల మీద గౌరవం ఉంటే వేద భాష మాట్లాడండి. బీజేపీ బండి సంజయ్ తమది హిందూ పార్టీ అని ఎలా ప్రకటిస్తారు? హైదరాబాద్‌‌‌లో వేరే పార్టీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలు దెబ్బతింటాయని నేను అనట్లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదనేది మాత్రం నిజం’ అని ఎన్.శంకర్ చెప్పారు.