సిద్దిపేట రూరల్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు చర్చకు సిద్ధమేనా..? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. ఇందుకు హైదరాబాద్ లోని123 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రావాలని సవాల్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి బాలికల గురుకుల స్కూల్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పాలనపై పదే పదే అబద్దాలాడుతూ విషం కక్కడం హరీశ్ రావుకు సరికాదని సూచించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందే కాంగ్రెస్ మంత్రిని చేసిందని గుర్తు చేశారు. మంత్రివర్గంపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని హితవు పలికారు. అధికారం పోయినా అక్కసు ఎందుకని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం పేరిట బీఆర్ఎస్ వేసిన ఆర్థిక భారాన్ని మోస్తూనే పేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపిస్తే ఢిల్లీకి పంపినట్లు తెలిపారని, ఇప్పుడు బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు సమస్యను పరిష్కరించాలన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పుతున్నామని మంత్రి తెలిపారు. బాలికల గురుకుల స్కూల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగితెలుసుకుని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
స్కూల్ లో అభివృద్ధి పనులకు రూ. 25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ గురుకులాలు , సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వలక్ష్యం మేరకు విద్యార్థులకు అన్నిసౌకర్యాలు సక్రమంగా అందేలా చూస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఆర్ సీఓ, డీసీఓ నరసింహచారి, ప్రిన్సిపాల్ లక్ష్మాంజలి, టీపీసీసీ చేతన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యుడు చంద్రం, నేతలు మహేందర్ రావు పాల్గొన్నారు.
