ఆదాయం పెంచే ప్లాన్స్ రెడీ చేయండి

ఆదాయం పెంచే ప్లాన్స్ రెడీ చేయండి

హైదరాబాద్, వెలుగు: గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్లాన్స్ రెడీ చేయాలని అధికారులను మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2267 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.3884 కోట్లు సమకూరడం అభినందనీయమన్నారు. గనుల శాఖలో 127 ఖాళీల భర్తీ విషయం సీఎం దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. శుక్రవారం  సెక్రటేరియేట్​లో సీఎస్ శాంతి కుమారితో కలిసి మంత్రి గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలులో ఉన్న మైనింగ్ , క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం ఎంతవరకు నెరవేరిందో ఆరా తీశారు. ఖనిజ బ్లాక్ ల వేలం అనుమతులపై చర్చించారు. రాష్ట్ర ఇసుక పాలసీ దేశంలోనే బెస్ట్ అని మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన ఇసుకను తక్కువ ధరకు అందించాలని అధికారులకు సూచించారు. అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో 101 రీచ్ ల  ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, 400  సీసీ కెమెరాలతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని వెల్లడించారు. పట్టా  భూముల్లో ఇసుక, తదితర తవ్వకాలకు వేగంగా  అనుమతులు వచ్చేలా  కలెక్టర్లకు లేఖలు రాయాలని ఆదేశించారు. టెక్నాలజీతో  గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయిని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్ పాల్గొన్నారు.