
మేడిపల్లి, వెలుగు : ‘ నేను చెప్పేది వింటారా.. ? వినరా? వినకపోతే మీ కర్మ, మీ ఇష్టం, ఓట్లేస్తే వేయండి, లేకపోతే లేదు’ అని మంత్రి మల్లారెడ్డి కాలనీవాసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి మల్లారెడ్డికి బోడుప్పల్ కార్పొరేషన్ లో నిరసన సెగ తగిలింది. తమ కాలనీలోకి రావద్దంటూ మంత్రికి వ్యతిరేకంగా కాలనీవాసులు నినాదాలు చేశారు.
బోడుప్పల్, చెంగిచెర్ల చింతల్ చెరువు నుంచి కాలనీలోకి ప్రవహించే కాలువ నుంచి దుర్వాసన ఎక్కువ రావడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. మేడిపల్లిలో బైక్ ర్యాలీకి వెళ్తున్న మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను గమనించి కాలనీవాసులు ఎదురుగా వెళ్లి అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఎన్నోసార్లు మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్థానిక బీఆర్ఎస్ నేతలకు చెప్పినా ఏ ఒక్కరు శాశ్వత పరిష్కారం చూపలేదని బాధితులు వాపోయారు. దుర్వాసనతో ఇండ్లలో ఉండలేని పరిస్థితి రోజు రోజుకి ఎక్కువ అవుతుందని, నీళ్లు కూడా కలుషితమయ్యాయని, వాటిని వాడితే చర్మంపై దురదలు వస్తున్నాయని కాలనీవాసులు వాపోయారు.