సర్కార్​ను వెనకేసుకొచ్చినా మంత్రికి దక్కని మద్దతు

 సర్కార్​ను వెనకేసుకొచ్చినా మంత్రికి దక్కని మద్దతు

హైదరాబాద్, వెలుగు: మంత్రి మల్లారెడ్డి సొంత గూటిలో ఒంటరి అయ్యారు. ఇటీవల రెడ్ల సింహగర్జన సభలో ఆయనపై దాడి జరగ్గా.. ఆ ఘటనపై టీఆర్ఎస్​లోని రెడ్డి లీడర్లు ఎవరూ మాట్లాడకపోవడం, కనీసం మాట మాత్రమైనా మద్దతు పలకకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమ పార్టీపై, లీడర్లపై, ప్రభుత్వంపై ఎవరు కామెంట్ చేసినా గంటల వ్యవధిలోనే తిప్పికొట్టే టీఆర్ఎస్ నేతలు... ఈ ఘటనపై మాత్రం స్పందించలేదు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన​ మంత్రులు, లీడర్లు కూడా అసలేమీ జరగనట్లు మౌనంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి తనపై దాడికి కుట్ర చేశారని స్వయంగా మల్లారెడ్డి ఆరోపించినా పార్టీ తరఫున గానీ, ప్రభుత్వం పక్షాన గానీ ఎవరూ పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. పార్టీలో చివరకు తన కులస్తులైన మంత్రులు కూడా అండగా నిలవకపోవడంపై మల్లారెడ్డి కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. 

అందరూ సైలెంట్.. 

మల్లారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ తగిన రీతిలో టీఆర్ఎస్​ నుంచి కౌంటర్ ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. పార్టీలోని రెడ్లలోనే కాదు బయట ఉన్న ఆ కులస్తుల్లోనూ ఇది పెద్ద చర్చకు దారి తీసింది. తనపై దాడి జరిగిన తెల్లారే మల్లారెడ్డి ప్రెస్​మీట్​పెట్టి తనను చంపాలని కుట్ర చేస్తున్నారని కూడా చెప్పారు. కేబినెట్​లో జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, నిరంజన్​ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

వీళ్లు సర్కారుపై ఈగ వాలినా వెంటనే రంగంలోకి దిగి ఖండిస్తారు. రైతు సమన్వయ సమితి చైర్మన్​పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డి కూడా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి, కౌన్సిల్​చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నా ప్రతిపక్షాలపై కామెంట్లు చేస్తుంటారు. కానీ మల్లారెడ్డి విషయంలో వీళ్లంతా మౌనంగా ఉండడంపై చర్చ జరుగుతోంది. 

ఎవరిపైనా చర్యల్లేవ్.. 

రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ రేవంత్ చేసిన కామెంట్లతో ఆ పార్టీలో, బయట పెద్ద చర్చ మొదలైంది. ఆయన కామెంట్లపై ఇతర కులాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మే 29న సిటీ శివారులోని ఘట్​కేసర్​లో రెడ్ల సింహగర్జన సభ జరిగింది. అందులో మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చేస్తున్న సేవలు, ప్రవేశపెట్టిన స్కీములు, ప్రభుత్వ పనితీరు గురించి గొప్పగా చెప్పారు. ఈ క్రమంలో కొందరు రెడ్డి కార్పొరేషన్​ ఏర్పాటు చేయించలేకపోయారు? అంటూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దాంతో మల్లారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, స్టేజీ దిగి వెళ్లిపోయారు. ఆయన వెళ్తున్న సమయంలో కాన్వాయ్​పై రాళ్లు, వాటర్ బాటిళ్లు, కుర్చీలు విసురుతూ దాడి చేశారు. ఒక మంత్రిపై ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగితే సాధారణంగా ప్రభుత్వం గానీ, మంత్రులు గానీ గట్టిగా స్పందించాలి. కానీ అలాంటిదేం జరగలేదు. సోషల్​ మీడియాలో కామెంట్లు చేసినందుకే రాష్ట్రంలో ఎందరినో అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి. కేటీఆర్, హరీశ్​ రావు లాంటి కొందరు మంత్రులు జిల్లాల్లో పర్యటనకు వెళ్లినపుడు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వం, అధికారులు.. మల్లారెడ్డిపై దాడి జరిగితే మాత్రం ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. 

రెడ్లు దూరమవుతారనేనా?  

రేవంత్, మల్లారెడ్డి ఎపిసోడ్​ తర్వాత రాష్ట్రంలోని రెడ్లంతా వెలమలకు తద్వారా టీఆర్ఎస్​కు దూరమవుతున్నారన్న సంకేతాలను సీఎం కేసీఆర్​పసిగట్టారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఎవరూ తలదూర్చవద్దని ప్రగతి భవన్​నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే మంత్రులంతా మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఒక్క తలసాని మాత్రం దాడి ఘటనను మొక్కబడిగా ఖండించారు. రెడ్డి మంత్రులు గానీ, ఇతర నేతలు గానీ ఈ విషయంపై స్పందించకపోవడంపై మల్లారెడ్డి అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. తమ నేత పార్టీలో ఒంటరైపోయినట్లు ఫీలవుతున్నారని వాళ్లు చెబుతున్నారు.