మంత్రి ఏకఛత్రాధిపత్యంతో బీఆర్ఎస్ ​లీడర్లు నారాజ్

మంత్రి ఏకఛత్రాధిపత్యంతో బీఆర్ఎస్ ​లీడర్లు నారాజ్
  •     అక్రమ కేసులు, భూవివాదాల్లో జోక్యంపై ఆరోపణలు
  •     కాంగ్రెస్ లో కయ్యాలు బీజేపీ కి లీడర్​లేని లోటు  

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా రాజకీయాల్లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఏక్ నిరంజన్ లా మారారు. అధికార యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం, కోట్ల విలువజేసే భూవివాదాల్లో  జోక్యం చేసుకోవడం,  ప్రశ్నించే వాళ్లపై పోలీసులతో కేసులు పెట్టి అణగదొక్కడం లాంటి ఆరోపణలను మంత్రి ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఈ అంశాలపైనే ప్రతిపక్షాలు నిరంజన్​రెడ్డిని ఇరుకునపెడ్తున్నాయి. మరోవైపు తమకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రియారిటీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్​లోని సెకండ్​కేడర్​ లీడర్లు మంత్రిపై గుర్రుగా ఉన్నారు.  తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు చేపట్టడంపై నారాజ్​ అవుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా మంత్రి స్పందించకపోవడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మంత్రితో లింక్ ​అయి ఉన్న ఈ ఇష్యూస్​ బీఆర్ఎస్​ విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. గ్రూపు రాజకీయాల్లో మునిగితేలుతున్న ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటాలు మరిచిపోవడం మైనస్​గా మారింది. మరో ప్రధాన పార్టీ బీజేపీకి బలమైన కేడర్​ ఉన్నా నడిపించే లీడర్​ లేకపోవడం ఆ పార్టీ అభిమానులను కలవరపెడుతోంది. 

సీన్​ మారింది... 

వనపర్తి నియోజకవర్గంలో ఇంతకుముందు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటీ ఉండేది. మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడేవారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్యకు అల్లుడైన నిరంజన్ రెడ్డి మొదట టీడీపీలో ఉండి టీఆర్​ఎస్​ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్ తో జత కట్టారు. 2014లో మాజీ మంత్రి చిన్నారెడ్డిపై 3వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన నిరంజన్ రెడ్డి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 51వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. తర్వాత మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరంజన్​రెడ్డికే టికెట్ వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ లో మాజీ మంత్రి చిన్నారెడ్డి , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ  సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. కేడర్​ బలంగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశాలున్నాయి.  

మంత్రిపై వ్యతిరేకత.. 

మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి. వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి మండల ఎంపీపీ మెగారెడ్డి మంత్రితో విభేదించి దూరమయ్యారు. మంత్రితో కలిసి పని చేయలేమని బహిరంగంగానే ప్రకటించారు. పెద్దమందడి మండలం మనిగిల్లకు చెందిన శివ.. మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల నుంచి బలవంతంగా భూములు కొని ఫాం హౌస్ కడుతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్​ పెట్టాడు. దీంతో అతడిపై కేసు పెట్టించి అరెస్ట్​ చేయించారు. ఇలా ఎవరైనా మంత్రిని దూషిస్తే అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్న పేరు వచ్చింది. అలాగే పోలీసులను అడ్డుపెట్టుకుని మంత్రి ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. వనపర్తి మున్సిపాలిటీలో వచ్చిన అవినీతి ఆరోపణలను మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ పట్టించుకోకపోవడం, మంత్రి నిరంజన్ రెడ్డి కూడా జోక్యం చేసుకోకపోవడంతో నెగటివ్​ టాక్ వచ్చింది.  

కాంగ్రెస్​లో ఆధిపత్య పోరు

కాంగ్రెస్​లో ఆధిపత్య పోరు నడుస్తోంది. కొంత కాలంగా మాజీ మంత్రి చిన్నారెడ్డికి, పార్టీలోని సీనియర్లకు పడడం లేదు. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం సీనియర్లు పని చేయకపోవడంతోనే ఓడిపోయానని ఆయన ఆరోపించారు. దీంతో సీనియర్లు ఆయనకు దూరమయ్యారు. చిన్నారెడ్డి పాతకాలం మనిషని, ఆయన ఇప్పటి రాజకీయాలకు పనికిరారంటూ ఆయనపై ఓ వర్గం ప్రచారం మెదలు పెట్టడంతో వివాదం పెరుగుతూనే ఉంది.  

పట్టు బిగిస్తున్న బీజేపీ  

వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో  బీజేపీకి మంచి పట్టుంది. బలమైన కేడర్​ ఉండడంతో పార్టీ ఇచ్చే పిలుపుకు అన్ని గ్రామాల్లో కార్యకర్తలు స్పందిస్తున్నారు. పార్టీలో సీనియర్, జూనియర్ వివాదంతో పాటు స్థానికులు, స్థానికేతరులు అన్న వ్యత్యాసాలు పార్టీకి మైనస్ గా మారుతున్నాయి. కొత్త వారి రాక కోసం పార్టీ ఎదురు చూస్తోంది. ఇటీవల పెరిగిన జాతీయ భావం, మోడీ హవా తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసేందుకు తెలంగాణ ఉద్యమకారుడైన నాగనమోని చెన్నరాములు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలకు, టీడీపీకి నియోజకవర్గంలో అభిమానులు ఉన్నప్పటికీ ఎవరికి మద్దతు ఇస్తారో అన్న దానిపైనే అందరి దృష్టి ఉంది.  
వనపర్తి ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్ రెడ్డి 

అనుకూల అంశాలు...

    నియోజకవర్గ అభివృద్ధి 
    టౌన్ రోడ్ల విస్తరణ 
    జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటు 
    70 కి పైగా మినీ ఎత్తిపోతల పథకాల 
    ఏర్పాటుతో సాగునీరందించడం
    ఇంటిగ్రేటేడ్ అగ్రికల్చర్ మార్కెట్ నిర్మాణం

ప్రతికూల అంశాలు..

    పార్టీలో సీనియర్లను, ద్వితీయ శ్రేణి నాయకుల సూచనలు పట్టించుకోకపోవడం
    వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిపై
     కేసులు పెట్టించడం  
    ప్రతి పక్షాలపై ఉక్కుపాదం  
     విలువైన  భూములు 
      కొన్నారనే ఆరోపణలు  
    జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి తిరుగుబాటు
    మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని 
    పట్టించుకోకపోవడం