పత్తి కొనుగోళ్లపై మంత్రి సమీక్షా సమావేశం.. నిర్ణ‌యించిన ధ‌ర‌లు ఇవే

పత్తి కొనుగోళ్లపై మంత్రి సమీక్షా సమావేశం.. నిర్ణ‌యించిన ధ‌ర‌లు ఇవే

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిల్లాకో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాల‌ని, రైతుల ఫిర్యాదులు, సూచనలు, సలహాలు స్వీకరించాలని అన్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సోమ‌వారం పత్తి కొనుగోళ్లపై తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 300 జిన్నింగ్ మిల్లులు, 9 మార్కెట్ యార్డ్ లలో పత్తి కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటుకు సీసీఐ(కాట‌న్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా) సిద్దమ‌ని , మిల్లర్లు వెంటనే సీసీఐతో అగ్రిమెంట్ చేసుకోవాలని అన్నారు.

కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి ఎట్టి పరిస్థితులలో అకాలవర్షాల మూలంగా తడిచే పరిస్థితి ఉండకూడదని మంత్రి అన్నారు. మార్కెటింగ్, వ్యవసాయ, పోలీస్, రవాణా, అగ్నిమాపక, తూనికలు, కొలతల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తేమ ఆధారంగా ప‌త్తి ధ‌ర‌లు నిర్ణ‌యించారు.

8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.5825 , 9 శాతానికి రూ.5766.75 , 10 శాతానికి రూ.5708,50 పైసలు, 11 శాతానికి రూ.5650.25, 12 శాతానికి రూ.5582 ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సీసీఐ సూచించిన 8 శాతం తేమకన్నా తక్కువగా ఆరుశాతం తేమ ఉంటే మద్దతుధర రూ.5825 కు అదనంగా రూ.116.50, ఏడు శాతం తేమ ఉంటే అదనంగా రూ.58.25 పైసలు ఇవ్వనున్న‌ట్టు తెలిపారు

కొనుగోలు కేంద్రాల వద్ద వెబ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, తేమయంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆపరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, తూనికలు, కొలతల శాఖతో అన్ని అనుమతులు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు నిరంజ‌న్ రెడ్డి . గ్రామాల వారీగా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గాను వ్యవసాయ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం ఏఈఓలు, ఏఓలు, ఇతర అధికారులు సమన్వయంతో టోకెన్లను జారీచేసి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి వేచిచూడకుండా వెంటనే వెళ్లిపోయేలా చూడాలని అన్నారు

పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు, నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు రైతులకు చేరేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల‌ని , కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సమన్వయ కమిటీలు కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాల‌ని మంత్రి సూచించారు.