ఫిబ్రవరి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్షలు : మంత్రి నిరంజన్​రెడ్డి

ఫిబ్రవరి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్షలు : మంత్రి నిరంజన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. 17 లోక్​సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను 125 గంటలపాటు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో కార్యకర్తల నుంచి విలువైన సలహాలు, సూచనలు వచ్చాయన్నారు. సోమవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్​ను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతోనే వారి మైత్రి తేటతెల్లమైందన్నారు. విధ్వంసమైన తెలంగాణ పేదల కోసం గులాబీ జెండా పుట్టిందని, నెత్తురుపారిన నేలపై నీళ్లు పారించిన చరిత్ర కేసీఆర్​ది అన్నారు. ప్రజలు కేసీఆర్​ను స్వాగతించే పరిస్థితి వచ్చే వరకు తాము సంయమనంతోనే ఉంటామన్నారు. బీఆర్ఎస్​ను చీలుస్తామన్న వాళ్లు.. చీకట్లో, మట్టిలో కలుపుతామన్న వాళ్లంతా మట్టిలో కలిసిపోయారని మాజీ స్పీకర్​మధుసూదనాచారి అన్నారు.

.40  ఏండ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశానని, రేవంత్​లా చిల్లరగా ఎవరూ మాట్లాడలేదన్నారు. కేసీఆర్​ ఒక్కడిగా బీఆర్ఎస్​ను స్థాపించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని అన్నారు. పార్టీ నేతల అలసత్వంతోనే ఓడిపోయామని చాలా మంది కార్యకర్తలు చెప్పారన్నారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.