
- రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్, వెలుగు: దశలవారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని, ఈ విషయంలో ఎవరూ కంగారు పడొద్దని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు.
బయ్యారంలో ఇందిరమ్మ ఇండ్లు, గొల్లగూడెంలో బ్రిడ్జి, బీటీ రోడ్డు పనులు, కొత్తపేటలో రూ.3 కోట్ల 5 లక్షలతో హాస్టల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తున్నామన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమాతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నామన్నారు. అనంతరం బయ్యారంలో బరిగెల ఉపేంద్ర ఉపేందర్కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి నూతన వస్త్రాలు అందించారు. కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీరబ్రహ్మచారి, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీవో పీడీ మధుసూదనరాజు, డీపీవో హరిప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజయ్య పాల్గొన్నారు.