కోమాలో ఉన్న బాలికకు అండగా నిలిచిన మంత్రి పొంగులేటి

కోమాలో ఉన్న బాలికకు  అండగా నిలిచిన మంత్రి  పొంగులేటి

కూసుమంచి, వెలుగు: ఏడాదిగా కూతురు కోమాలో ఉండడంతో చికిత్స చేయించలేక తండ్రి ఆత్మహత్య చేసుకోగా, ఆ కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి.. ధర్మతండా గ్రామానికి చెందిన జర్పుల పరుశురాం ఇటీవల సూసైడ్​ చేసుకోగా, ఆయన కుటుంబాన్ని మంత్రి పొంగులేటి పరామర్శించారు. ఆయన కూతురు సింధు గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిందని, ఆర్థిక స్థోమత సరిగా లేక పూర్తిస్థాయిలో వైద్యం అందించలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా సింధుకు వైద్యం అందిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఇందులోభాగంగా సోమవారం మంత్రి సొంత ఖర్చులతో హైదరాబాద్​లోని కేర్​ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కోసం అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని చెప్పారు. ఖమ్మం ఎంపీ రఘరాంరెడ్డి దగ్గర ఉండి సింధుకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంత్రి, ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.