- మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి
ఇల్లెందు, వెలుగు : రాష్ట్రంలో ప్రజల అభీష్టం మేరకు పాలన కొనసాగుతుందని, సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఆదివారం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వ కేంద్రం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నందునే ప్రజల మన్ననలు పొందుతున్నామని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమే జూబ్లీహిల్స్ ఫలితమన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఐసీయూ ఆపరేషన్ గది, వెయిటింగ్ హాల్, షెడ్ నిర్మాణం, అంబులెన్స్ ఇవ్వాలని ఐటీడీఏ పీవో రాహుల్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజు, ఆర్డీవో మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి చట్టంతో రైతులకు మేలు
అన్నపురెడ్డిపల్లి,వెలుగు: భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుందని, భూ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. మండలంలోని రాజాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భీంరెడ్డి మల్లారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ఆయన పరామర్శించారు.
అనంతరం గ్రామంలోని రైతులతో మాట్లాడారు. మండలంలోని ఊటుపల్లి, నర్సాపురం రెవెన్యూ 101. 118 సర్వే నంబర్లలోని భూముల్లో వాస్తవ భూమికంటే రికార్డుల్లో ఎక్కువ భూమి ఉన్న కారణంగా అప్పట్లో చాలా మందికి పట్టాలు మంజూరు కాలేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి భూముల్లో సర్వే సకాలంలో పూర్తిచేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులను అదేశించారు.
జోరుగా కార్తీక మాస వనమహోత్సవాలు
భద్రాద్రికొత్తగూడెం :జిల్లాలోని పలు చోట్ల పెద్ద ఎత్తున కార్తీక మాస వన మహోత్సవాలను ఆదివారం నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురంలోని మామిడితోటలో నిర్వహించిన రెడ్డి వన సమారాధనలో మంత్రి పొంగులేటి, సెంట్రల్ పార్కులో నిర్వహించిన కమ్మ వన సమారాధనలో అగ్రికల్చర్ మినిస్టర్తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల కళ్లల్లో ఆనందం.
సత్తుపల్లి : ఇందిరమ్మ ఇల్ల గృహప్రవేశాల సందర్భంగా నిరుపేదల కళ్లలో ఆనందం చూశానని మంత్రి పొంగులేటి అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణ పరిధిలోని 11, 22, 23 వ వార్డుల్లో నిర్మాణం పూర్తయిన పలువురి ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమాలకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు వ్యక్తిగతంగా నూతన వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు.
