
ములుగు జిల్లా: ములుగు జిల్లా వెంకటాపూర్లో చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ పర్యటించారు. వెంకటాపూర్లో భూ భారతి అమలు తీరుపై అవగాహన సదస్సు జరిగింది. రెవెన్యూ అధికారులు, రైతులకు భూ భారతి అమలు తీరు, విడి విధానాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, ఇప్పుడు అదే చేశామని చెప్పారు.
అసెంబ్లీలో భూభారతి బిల్లు పెడితే బీఆర్ఎస్ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని, ధరణి చట్టం చేసిన తర్వాత రెవెన్యూ సదస్సులు ఎందుకు పెట్టలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. సదస్సులు పెడితే ధరణి బాధితులు మీ వీపులు పగలకొట్టేవారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పొంగులేటి వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 9.24 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటన్నిటినీ భూభారతి ద్వారా పరిష్కరిస్తామని పొంగులేటి తెలిపారు.
సాగు చేసుకుంటున్న రైతుల పేర్లకు బదులు, పింక్ షర్ట్ వేసుకున్న వాళ్లకు పట్టా పాసు పుస్తకాలు ఇచ్చింది గత కేసీఆర్ సర్కార్ అని ఆయన ఆరోపించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. ధరణి పార్ట్ బీలో 18 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, పేదల ఆరున్నర లక్షల ఎకరాల భూమి అందులోనే ఉందని చెప్పారు. ఆ పేదల భూ సమస్యకు భూభారతి పరిష్కారం చూపుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజల మధ్యకు వచ్చి భూభారతి చట్టం చేశామని, అధికారులు అక్రమంగా భూములు పట్టాలు చేస్తే అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని, అబాది భూమికి కూడా భూమి కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూముల మ్యాప్లు ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని, భూముల కొలతలకు, 6 వేల మంది సర్వేయర్లను సిద్దం చేస్తున్నామని చెప్పారు. భూభారతి చట్టానికి విధివిధానాలు ఖరారు చేశామని, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అభిప్రాయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. భూ భారతి చట్టానికి 90 రోజుల్లో విధి విధానాలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.