భవిష్యత్తులో పిల్లలకు వివాదాలు లేని ఆస్తి ఇవ్వాలన్నదే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి

భవిష్యత్తులో పిల్లలకు వివాదాలు లేని ఆస్తి ఇవ్వాలన్నదే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి

రైతన్నల దీవెనలతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్నదాతను రాజు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన రెండున్నరేండ్లలో వేల కోట్లు రైతన్నల కోసం ఖర్చు చేశామని, కనీవినీ ఎరగని విధంగా పంటలు పండించామని ఆయన తెలిపారు. గతంలో సేకరించిన ధాన్యాన్ని స్టోర్ చేసే కెపాసిటీ లేకపోయినా.. చివరి గింజ వరకు కొంటామన్న ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని గుర్తుచేశారు.

హనుమకొండ జిల్లా  కమలాపూర్ మండలం గూడూరులో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  రైతులకు సంకెళ్లు వేసి, వరి వేస్తే ఉరి అన్న బీఆర్ఎస్ నాయకులు.. నేడు ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేస్తూ పాదయాత్రలతో తప్పుదోవ పట్టిస్తున్నారని  మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, పదే పదే ఈ మాట చెప్పడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదని.. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారే నేడు గోబెల్స్ ప్రచారాలు చేస్తూ ఎద్దేవా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో పిల్లలకు వివాదాలు లేని ఆస్తి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి..భూభారతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూముల రీ-సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు.

ALSO READ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‎కు జాతీయ హోదా ఇవ్వలేం

మూడు, నాలుగు విడతల్లో వ్యవసాయ భూములతో పాటు మిగతా ఆస్తులను కూడా మ్యాపులతో సహా అందజేస్తామని, గత ప్రభుత్వం తెచ్చిన 'ధరణి'ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.ఎలాంటి స్వార్థం లేకుండా రైతుల కోసం పనిచేస్తున్నామని పేర్కొన్న ఆయన.. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీరు తక్కువగా వినియోగించే పంటలనే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.