
భూ భారతి చట్టం తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో భూభారతిపై అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన ప్రజలు కోరుకున్న చట్టం తెచ్చామన్నారు. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. సాదాబైనామా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. 2020 ఆర్వోఆర్ చట్టంలో సాదాబైనామా పెట్టలేదని.. రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారన్నారు పొంగులేటి. సాదాబైనామా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని చెప్పారు. ధరణితో ఆనాడు నిలవునా దోచుకున్నారని ఆరోపించారు.
ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రంలో 25 లక్షల భూములు పంచామన్నారు పొంగులేటి . అర్హులైన పేదలకు భూమి పట్టాలు ఇవ్వాలన్నారు. జూన్ 2న అర్హులైన పేదల సాగుకు భూములిస్తామన్నారు. గ్రామ గ్రామానికి ఎమ్మార్వో స్థాయి అధికారులు వస్తారని చెప్పారు. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. 5 ఏండ్లలో20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.
18 రాష్ట్రాల్లో స్టడీ: వివేక్
ప్రజలకు న్యాయం చేసేందుకే భూ భారతి తెచ్చామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో భూభారతిపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి. 18 రాష్ట్రాల్లో స్టడీ చేసి భూభారతి తెచ్చామన్నారు. నిజమైన పట్టాదారులు ఎవరో భూభారతితో తెలుస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ధరణిలో కబ్జాకాలం ఎత్తేసిందని.. సైడ్ డీల్ కోసమే ఆనాడు కేసీఆర్ కబ్జా కాలం ఎత్తేశారని ఆరోపించారు వివేక్.డబుల్ బెడ్రూం ఇళ్లతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు ఎమ్మెల్యే వివేక్. ఏ ఊర్లోనైనా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు నిజమైన పేదవాళ్లేకే ఇస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తోందన్నారు. గ్రామ గ్రామానా మన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.