సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరణి

సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరణి
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి 

హైదరాబాద్, వెలుగు : ధరణి పోర్టల్​ను సామాన్యులకు అందుబాటులో ఉండేలా పునర్​వ్యవస్థీకరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలన్నీ కలిపి ఒకేచట్టంగా రూపొందించాలని ధరణిపై ఏర్పాటైన కమిటీ సూచించిందని మంత్రి తెలిపారు. భూవివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ  ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయాలని కూడా సిఫారసు చేసిందన్నారు.

 శుక్రవారం సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండ రెడ్డి, ఎం.సునీల్ కుమార్, మధుసూదన్​తో మంత్రి సమావేశమయ్యారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్  వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూసమస్యలతో ఛిన్నాభిన్నం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో సుమారు 200 కుటుంబాలు భూసమస్యలను ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ పోర్టల్‌‌ అమలు కారణంగా వచ్చిన సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులపై సమావేశంలో చర్చించామని, కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ముందే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. 

నెలఖారుకు 2.20 లక్షల అప్లికేషన్లు పరిష్కారం: సీసీఎల్​ఏ

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్​లోని వివిధ మాడ్యూల్స్ లో ఉన్న 2.20 లక్షల పెండింగ్​ దరఖాస్తులను ఈ నెలఖారులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్ఏ నవీన్​ మిట్టల్​ ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్​ నుంచి అన్ని జిల్లాల కలెక్లర్లతో విడతల వారీగా ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ధరణిలో ఎదురవుతున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. నిరుడు ఫిబ్రవరి నుంచి ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించగా.. అందులో 163 సమస్యలను పరిష్కరించామని తెలిపారు. వారం, పది రోజుల్లో మరోసారి కలెక్టర్లతో భేటీ అవుతామని వెల్లడించారు. పార్లమెంట్​ ఎన్నికల ప్రక్రియలో భాగంగానే పెండింగ్ దరఖాస్తులు పెరిగాయన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పెండింగ్  దరఖాస్తులు ఉండగా... అతి తక్కువగా ములుగులో ఉన్నాయన్నారు.