- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
- అభివృద్ధి పనులు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై సీరియస్
ములుగు/తాడ్వాయి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం మహాజాతరకు వస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాం నాయక్‌తో కలిసి మంత్రి పొంగులేటి వనదేవతలను దర్శించుకొని, అభివృద్ధి పనులను పరిశీలించారు. జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి బాంబూ చికెన్ క్యాంటీన్ ను ప్రారంభించారు.
అనంతరం హరిత హోటల్ లో అధికారులతో రివ్యూ చేశారు. మహాజాతర అభివృద్ధి పనులకు ఈనెల 12లోగా పూర్తి చేయాలని, ఆ తర్వాత జాతర ప్రాంగణంలో ఒక్క మెషీన్ కూడా కనిపించవద్దని ఆదేశించారు. పని చేయని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్‌కు సూచించారు. ఈ 18న సీఎం మేడారం వచ్చి రాత్రి బస చేస్తారని, 19న ఉదయం వనదేవతలను దర్శించుకుంటారని తెలిపారు.
అనంతరం అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని చెప్పారు. మహాజాతరలో కుంభమేళాను తలపించేలా డెకరేషన్ చేయాలన్నారు. జాతర పనుల్లో అలసత్వం తగదని, విద్యుత్ అధికారులు చేపడుతున్న పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఆర్అండ్బీ శాఖతో సమన్వయం లేకుండా డ్రైనేజీ ఏర్పాటు చేసే చోట పోల్స్ ఎలా వేస్తారని సీరియస్ అయ్యారు.
ఇదిలాఉంటే రివ్యూ మీటింగ్‌లోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో వచ్చి హల్చల్ చేశాడు. మంత్రి పొంగులేటి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా , మహబూబాబాద్, భూపాలపల్లి ఎస్పీలు శబరీశ్, శిరీషెట్టి సంకీర్త్, ఏఎస్పీ మనన్ భట్ పాల్గొన్నారు.
