V6 News

దక్షిణాదికి అన్యాయం చేసేలా బీజేపీ కుట్ర : మంత్రి సీతక్క

దక్షిణాదికి అన్యాయం చేసేలా బీజేపీ కుట్ర : మంత్రి సీతక్క
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • బీజేపీ మాతృ సంస్థ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌లో మహిళలకు ప్రాధాన్యం ఉందా : మంత్రి సీతక్క

తాడ్వాయి, వెలుగు : మహిళా బిల్లుతో బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్‌‌‌‌, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వాపురం ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మేడారం వనదేవతలను దర్శించుకున్నారు.అనంతరం స్థానిక హరిత హోటల్‌‌‌‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలో జరుగుతున్న పనుల గురించి కలెక్టర్‌‌‌‌ దివాకర టీఎస్‌‌‌‌ వివరించారు. 

అనంతరం మంత్రి పొంగులేటి  మాట్లాడుతూ... బీజేపీ చేస్తున్న కుట్రను ఇండియా కూటమి పసిగట్టి.. ఆ బిల్లు వీగిపోయేలా చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్‌‌‌‌ బిల్లుకు కాంగ్రెస్‌‌‌‌ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ బీజేపీ రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నామని చెప్పారు. మేడారంలో రాతి శిల పడి గాయపడిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మేడారం ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులను క్వాలిటీగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ ప్రకారం మంజూరైన అన్ని ప్రధాన ఆర్చీల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సారలమ్మ పూజారుల కోరిక మేరకు క్యూలైన్‌‌‌‌ పక్కనే ప్రత్యేకంగా సారలమ్మ ప్రధాన ఆర్చీ ఏర్పాటుకు ప్రపోజల్స్‌‌‌‌ సిద్ధం చేయాలని సూచించారు. 

రాతి నిర్మాణాల్లో ఎక్కడా చిన్న ఖాళీలు కూడా లేకుండా పటిష్టంగా ఉండేలా చూడాలని, గద్దెల ప్రాంగణంలో ఎత్తుపల్లాలు లేకుండా ఫ్లోరింగ్ సరిచేయాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఆలయ ప్రాంగణంలోని డ్రైనేజీని ప్రధాన రహదారి డ్రైనేజీకి లింక్ చేసే పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఫేజ్-2లో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

అనంతరం నార్లాపూర్‌‌‌‌ గ్రామంలో ఆవుల లక్ష్మి రాజు దంపతులకు చెందిన ఇందిరమ్మ ఇంటిని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, సీతక్క, కలెక్టర్‌‌‌‌ దివాకర టీఎస్‌‌‌‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌‌‌‌ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌, ఏఎస్పీ మనన్‌‌‌‌ భట్, డీఎఫ్‌‌‌‌వో రాహుల్‌‌‌‌ కిషన్‌‌‌‌ జాదవ్, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ మహేందర్‌‌‌‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ బానోతు రవిచందర్, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ రేగ కళ్యాణి, ఏపీవో వసంతరావు, ఆర్డీవో వెంకటేశ్‌‌‌‌, మేడారం సర్పంచ్ పీరిలా భారతి వెంకన్న, తహసీల్దార్‌‌‌‌ సురేశ్‌‌‌‌బాబు, ఈవో మేకల వీరస్వామి పాల్గొన్నారు.

మహిళలపై బీజేపీది కపట ప్రేమ : మంత్రి సీతక్క

కేంద్ర ప్రభుత్వం మహిళలపై కపట ప్రేమ చూపుతూ నాటకాలు మొదలుపెట్టిందని మంత్రి సీతక్క విమర్శించారు. మహిళల బిల్లు అని చెప్పి డీలిమిటేషన్‌‌‌‌ ద్వారా దక్షిణాది ప్రాధాన్యం తగ్గించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మాతృ సంస్థ ఆర్‌‌‌‌ఎస్ఎస్‌‌‌‌లో మహిళలకు ప్రాధాన్యం ఉందా..? మహిళలకు సభ్యత్వం ఉందా..? అని ప్రశ్నించారు. బీజేపీ పుట్టినప్పటి నుంచి మహిళను ఒక్కసారైనా జాతీయ అధ్యక్షురాలిని చేశారా ? అని నిలదీశారు. జనగణన లెక్కలు తేలకుండా డీ లిమిటేషన్‌‌‌‌ ఎలా చేస్తారు అని ప్రశ్నించారు.