
హాలియా, వెలుగు : దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై పేదలకు హక్కులు కల్పించాలని, మానవీయ కోణంలో భూసమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెలకొన్న భూసమస్యలపై మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, రెవెన్యూశాఖ సెక్రటరీ డీఎస్ లోకేశ్‌కుమార్, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, వివిధ శాఖల అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపించి భూసమస్యలను జఠిలం చేయొద్దని అధికారులకు చెప్పారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 50 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వివిధ కారణాలు, నిబంధనలు చూపుతూ అధికారులు కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. అధికారులు సమన్వయంతో భూసమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటిని కలిసిన పూర్వ వీఆర్వోల సంఘం నాయకులు
యాదగిరిగుట్ట, వెలుగు : గ్రామ పరిపాలన అధికారులుగా తమకు మరోసారి అవకాశం కల్పించాలని పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల బాలకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏలు సోమవారం హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.