
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజ్వరేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని.. బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని.. ఇందులో భాగంగానే బీసీ బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ద్వారా 2018లో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
గురువారం (జూలై 10) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాంలపై మంత్రి మండలి చర్చించింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కీలక ప్రకటన చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రెండు విద్యాసంస్థలను యూనివర్శిటీలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమిటీ, సెంటెనరీ విద్యాసంస్థకు వర్శిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ భేటీలు జరిగాయని 327 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించామని చెప్పారు.
18 మంత్రి మండలి సమావేశాల్లో 321 అంశాలకు ఆమోదం లభించిందన్నారు. ఇప్పటి వరకు కేబినెట్ ఆమోదించిన అన్ని అంశాలపై ఇవాళ్టి భేటీలో సమీక్షించామన్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి కేబినెట్ భేటీ ఉంటుందని గతంలో చెప్పాం.. దానికి అనుగుణంగా ఈ నెల 25వ తేదీన మళ్లీ కేబినెట్ భేటీ ఉంటుందని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేబినెట్ నిర్ణయాలు, అమలుపై సమీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా మా కేబినెట్ పని చేస్తోందని పేర్కొన్నారు.