
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండలంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల కాంగ్రెస్ కార్యకర్తలతో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా ఎంపీ రఘురాంరెడ్డిని నియమిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని గుర్తుచేశారు. అర్హులైనవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకమన్నారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుపుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు.
వాస్తు ప్రకారం పనులు చేపట్టండి
భద్రాచలం : వాస్తు ప్రకారమే శ్రీరామదివ్యక్షేత్రంలో ప్రతీ పనిని చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం మాడవీధుల్లో శుక్రవారం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులతో కలిసి ఆయన పర్యటించారు. ఇటీవల భూసేకరణలో భాగంగా తీసుకున్న ఇండ్లను తొలగించే ప్రక్రియను పరిశీలించారు.
ఈవో రమాదేవి, ఈఈ రవీందర్రాజులతో చర్చించారు. మిగిలిన ఇండ్లను త్వరగా తొలగించాలని ఆదేశించారు. సేకరించిన భూమికి బౌండ్రీలు నిర్ణయించి జెండాలు పాతాలని సూచించారు. ఆర్కిటెక్‌ను పిలిపించి ఆగమశాస్త్రం వాస్తు ప్రకారం పక్కాగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలన్నారు. రెండు రోజుల్లో కలెక్టర్ అధ్యక్షతన రివ్యూ మీటింగ్ పెట్టి అన్నీ సిద్ధం చేసి పూర్తి నివేదికలతో రావాలని ఆదేశించారు.
గిరిజన బిడ్డలకు ప్రశంస
ఆదివాసీ గిరిజన బిడ్డలు తమ శక్తిని ప్రపంచానికి చాటారని మంత్రి పొంగులేటి ప్రశంసించారు. గిరిజన భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ రేలా మహిళాశక్తి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. వారు తయారు చేస్తున్న సోప్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. మిల్లెట్ బిస్కెట్లు తయారు చేసి భద్రాచలం మన్యం నుంచి లండన్ వరకు పంపుతున్న ఇక్కడి ఆదివాసీ బిడ్డలు స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ను అభినందించారు.
అనంతరం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఇందిర మహిళాశక్తి సంబరాల్లో మంత్రి మాట్లాడారు. గత ఎన్నికల్లో మహిళలు తమ రక్తాన్ని చెమటగా చేసి నాటి రావణకాష్టం లాంటి పాలనకు చరమగీతం పలికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని, తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కు రాకుండా కష్టపడ్డారని పేర్కొన్నారు. చివరి ఐదేళ్ల పాలనలో ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన రూ.3750కోట్ల పావలా వడ్డీ రుణాలను కూడా ఆపేశారని ధ్వజమెత్తారు. అందుకే మీరు ఎన్నుకున్న ఇందిరమ్మ రాజ్యంలో 18 నెలల్లోనే రూ.875కోట్లను మా ఆడబిడ్డలకు రుణాలను ఇచ్చిందని ప్రకటించారు.
ఇది దొరల ప్రభుత్వం కాదు...
బూర్గంపహాడ్ : ఇది దొరల ప్రభుత్వం కాదని, సొల్లు కబుర్లు చెప్పడం మానేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు చేశారు. బూర్గంపహాడ్ లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన మాట్లాడారు. 229 స్వయం సహాయక గ్రూపులకు రూ.19.18కోట్ల బ్యాంకు లింకేజి రుణాలను అందజేశారు.
తాము అధికారంలోక్ వచ్చిన నెలల్లోనే మహిళా స్వయం సంఘాలను ఏ విధంగా ముందుకు నదిపిస్తున్నామో, మహిళాశక్తి అంటే ఏమిటో గత పాలకులకు తెలియచేయటానికే ఈ సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ఈ జిల్లా నుంచి బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదన్నారు. బూర్గంపహాడ్ లోని గోదావరి ముంపు ప్రాంతాన్ని మైదాన ప్రాంతానికి తరలించేందు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సీతారామ జలాలను బూర్గంపహాడ్ మండలంలోని సాగునీటి అవసరాలకు తరలిస్తామని చెప్పారు.