
- ఎంతటివారైనా క్రిమినల్ కేసులు పెడ్తం: మంత్రి పొంగులేటి
- ఫిర్యాదులపై మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో అవినీతిని ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. లంచం అడిగిన వారిని ఇందిరమ్మ కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్లలో కొండ లింగయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం రూ.10 వేలు డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తెయ్యపై అధికారులు విచారణ జరిపించారు. నిజమని తేలడంతో చర్యలకు సిద్ధమవుతున్నారు.
జనగామ జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్ధిదారు నుంచి పంచాయతీ సెక్రటరీ రూ.30 వేలు డిమాండ్ చేశాడని, దీనిపై వెంటనే విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. కాగా, లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం పోయిన వారం హౌసింగ్ కార్పొరేషన్‌లో కాల్ సెంటర్ ప్రారంభించారు. దీనికి వచ్చిన ఫిర్యాదులపై సెక్రటేరియెట్లో శుక్రవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సీజీజీ అడిషనల్ డీజీ సంగ్రామ్ సింగ్, హౌసింగ్ కార్పొరేషన్ సీఈ చైతన్య కుమార్ ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు.
నిధులను బ్యాంకర్లు కట్ చేసుకోవద్దు
ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండ్లు మంజూరుకాని నలుగురి ఖాతాల్లో నిధులు జమ చేసిన సెక్రటరీలను సస్పెండ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ‘‘ప్రతి సోమవారం నిధులు రిలీజ్ చేస్తున్నాం. కానీ.. కొన్ని బ్యాంకులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా పాత బకాయి కింద కట్ చేసుకుంటున్నరు. ఇలాంటి చర్యలను సహించేది లేదు. సదరు బ్యాంకులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను ఈ నెల 25వ తేదీలోగా పరిష్కరించి దసరా లోపు చెల్లింపులు పూర్తిచేయాలి’’అని ఆదేశించారు. అలాగే ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 180059 95991కు కాల్ చేసి వివరాలు తెలియజేయాన్నారు.