తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్​లో మంత్రి పొన్నం తనిఖీలు

తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్​లో మంత్రి పొన్నం తనిఖీలు
  •     శుభ్రంగా లేకపోవడంతో  అధికారులపై ఫైర్

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపల్ పరిధిలోని రెసిడెన్షియల్ స్కూల్ ను శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 640 మంది చదువుకుంటున్న స్కూల్ ఆవరణ శుభ్రంగా లేకపోవడం, హాస్టల్ వసతి, క్లాస్ రూమ్​లో ఒకే గదిలో ఉండడంతో అధికారులను పిలిపించి మండిపడ్డారు.

కొంత మంది స్టూడెంట్లు చెట్ల కింద చదువుతుండడంపై ఆరా తీశారు. అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణ బాబు, మెదక్ కలెక్టర్ రాజర్షి షాతో ఫోన్​లో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.  విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు, ఆట వస్తువులతో పాటు ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

స్కూల్ లో వాటర్ ప్లాంట్ రిపేర్ల కోసం మంత్రి రూ.50 వేలను సిబ్బందికి అందించారు. ప్రతి తరగతి గది తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. టెన్త్​ఫైనల్​పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తుప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్​, తహసీల్దార్ విజయలక్ష్మి ,ఎంపీడీఓ అరుంధతి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రసిడెంట్ భాస్కర్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.