- ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు..
- హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: పూజా కార్యక్రమాలు, సన్మానాలు, శుభకార్యాలు ఏవైనా సరే కేవలం చేనేత శాలువాలనే ఉపయోగించాలని ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడటాన్ని ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించాలని విజ్ఞప్తి చేశారు. నేతన్నలకు అండగా నిలిచేందుకు పట్టు చీరలు, చేనేత వస్త్రాల వినియోగాన్ని మరింత పెంచాలన్నారు. గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ప్రధాన కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణకు మంత్రి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని నేత కార్మికుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. అన్ని శాఖల అధికారిక వేడుకలు, సమావేశాల్లో చేనేత వస్త్రాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను వెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
