
- ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది
- కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి
- కార్మిక సంఘాల నేతలతో మంత్రి భేటీ
- సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది: అశ్వత్థామరెడ్డి
- కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని పిలుపు
- కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలి: ఈదురు వెంకన్న
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ సమయంలో కార్మికులు సంస్థకు అండగా నిలవాలి. సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని కోరారు. కార్మికుల సమస్యలు వినేందుకు తాను, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నామని.. తమ ఆఫీసుల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.
సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో పొన్నం సమావేశమయ్యారు. ఇందులో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి (టీఎంయూ), ఎన్‌ఎంయూ వైస్ చైర్మన్ ఎం.నరేందర్, బీఎంఎస్ కోచైర్మన్ ఎర్ర స్వామి కుమార్, ఎస్‌టీఎంయూ కోచైర్మన్ పున్న హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే తమకు ప్రాధాన్యమని తెలిపారు. గత 16 నెలలుగా సంస్థ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఒక్క విషయంలోనైనా ఇబ్బంది పెట్టామా? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ వల్లనే ఆర్టీసీ నిర్వీర్యం..
గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని పొన్నం మండిపడ్డారు. ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని, ఉద్యోగుల సీసీఎస్, పీఎఫ్ డబ్బులు కూడా వాడుకున్నదని ఫైర్ అయ్యారు. ‘‘ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ల మొత్తం రూ. 400 కోట్లను మా ప్రభుత్వం వచ్చాక చెల్లించాం. 2017 పే స్కేల్ 21 శాతం ఇవ్వడంతో ఏడాదికి రూ. 412 కోట్ల భారం పడుతున్నది. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ నిధులు రూ.1,039 కోట్లు చెల్లించాం.
నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ 2024 జనవరి నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు రూ. 345 కోట్లు చెల్లించాం. సీసీఎస్ నెలవారీ కంట్రిబ్యూషన్ కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. 1,500 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలిచ్చాం. కొత్తగా ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేశాం. తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాం” అని వెల్లడించారు.
సమ్మెకు దూరంగా ఉండండి: అశ్వత్థామ రెడ్డి
ఈ నెల 7 నుంచి జరగనున్న ఆర్టీసీ సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశమైన తర్వాత ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలి” అని అందులో పేర్కొన్నారు.
సమ్మెలో పాల్గొనండి: ఈదురు వెంకన్న
సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదని, అందుకే ఈ నెల 7 నుంచి ఆర్టీసీలోని అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ జేఏసీ (మరో వర్గం) పిలుపునిచ్చింది. సోమవారం సాయంత్రం ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఉద్యోగులు కవాతు నిర్వహించారు. అనంతరం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కోచైర్మన్ హన్మంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడారు. ‘‘గత బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల కాలంలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు.
ఉన్న సమస్యలను పెంచి మరింత జఠిలం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18 నెలలు గడిచినా మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించలేదు. అందుకే సమ్మెకు అనివార్యంగా పోవాల్సి వస్తున్నది” అని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ఆర్టీసీలో యూనియన్లను అనుమతించడం లేదు. ఒక్కో ఉద్యోగితో 16 గంటల పాటు డ్యూటీలు చేయిస్తున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్నవారిపైనే పనిభారం మోపుతున్నారు” అని ఫైర్ అయ్యారు.
సమ్మె.. సమస్యలకు పరిష్కారం కాదు: ఆర్టీసీ యాజమాన్యం
సమ్మెతో సమస్యలు పరిష్కారం కావని, 2019లో జరిగిన సమ్మెతో సంస్థ తీవ్రమైన నష్టాల్లోకి వెళ్లిందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల్లోని ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ఇతర ఉద్యోగులు ప్రభావితం కావద్దని సూచించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం సమ్మె చట్ట వ్యతిరేకం. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, వారి విధులకు ఆటంకం కలిగించినా అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించింది.
‘‘గత మూడున్నరేళ్లుగా సంస్థ అభివృద్ధి కోసం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు స్వాగతించారు. సంస్థ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న సమయంలో సమ్మె పేరుతో సంస్థ మనుగడకు, ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించవద్దు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీపడబోదు” అని స్పష్టం చేసింది.