
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేజర్వేషన్లు బరాబర్ అధికారికంగా అమలు చేస్తామని అన్నారు. రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్ లో చేర్చడం అసాధ్యమని అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టాడని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని... గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగిందని అన్నారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపీలు రాజీనామా చేస్తే ..ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూద్దామని అన్నారు మంత్రి పొన్నం.
రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపెరికల్ డేటా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని.. సుప్రీంకోర్టు లో ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పారని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం శాసన సభ ఆమోదం , గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉందని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తామని అన్నారు.
అనాడు మండల కమిషన్ తీసుకొస్తే కమండల్ అన్నది మీరేనని... మళ్ళీ మీ వక్ర బుద్ధిని, బీసీల పట్ల కుట్రను బయటపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుపై ఫైర్ అయ్యారు పొన్నం. తెలంగాణలోని అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి రినర్వేషన్లు ప్రక్రియను కాపాడుకునే దానిలో ముందుండాలని కోరుతున్నానని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా 9 వ షెడ్యూల్ లో చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. గతంలో జనహిత అభియాన్ కేసులో EWS సందర్భంగా స్పష్టంగా చెప్పిందని... EWS ఇచ్చినప్పుడు 50 శాతం రిజర్వేషన్ల స్లాబ్ ఎత్తివేశారని అన్నారు.
సామాజిక న్యాయంతో కాంగ్రెస్ తోనే సాధ్యమని.. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు పొన్నం. మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే.. ఎస్సీ ఉప ముఖ్యమంత్రి, మా పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నారని అన్నారు. మా వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరిస్తున్నానని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.