
- సామాజిక న్యాయానికి కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్
- కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మార్పు ప్రారంభమైంది
- మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాం
- బీజేపీ నేతలు బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వ్యాఖ్య
- ఢిల్లీలో భాగిదార్ న్యాయ్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చేవి బీసీల రోజులేనని.. వాటిని సాధించుకోవడం కోసం అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లకు కల్పించే మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందేలా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే, తెలంగాణ బలహీన వర్గాల ఆగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితుల్లో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. శుక్రవారం ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బీసీ వింగ్ నేతృత్వంలో జరిగిన ‘భాగిదార్ న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటు వందలాది మంది కాంగ్రెస్నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ భవన్ లో మంత్రులు మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర నేతలకు చేతనైతే తెలంగాణ ప్రజల కోసం అధిష్టానంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం చేసి, కేంద్రానికి పంపామన్నారు. కానీ... బీజేపీ ఫ్యూడలిస్టిక్ బుద్ధితో ఈ బిల్లుల్ని ఆపుతోందని మండిపడ్డారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలోని బీసీ నేతలు కూడా ఆలోచించాలని, సొంత వర్గానికి జరగబోయే మేలు కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు బీసీల నోటి కాడికి వచ్చిన కూడును తన్నే ప్రయత్నం చేయొద్దన్నారు.
అలా కాదని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే.. తెలంగాణలోని కుల సంఘాలు బీజేపీ నేతల్ని ఒక్క అడుగు కూడా బయటపెట్టనీయమని హెచ్చరించారు. తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బాధ్యత తీసుకొని బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించారు. మాటకు ముందు ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకం అంటోన్న బీజేపి నేతలు.. గుజరాత్, యూపీ, మహారాష్ర, పొత్తులో ఉన్న పక్క రాష్ట్రం ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించి మాట్లాడాలని సవాల్ విసిరారు.
ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తం
సామాజిక న్యాయం దిశలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మార్పు ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ దిశలో తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించామన్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన కార్పొరేషన్, ఇతర పదవుల్లో ఆయా వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అయితే.. తమ కేబినెట్ లో బీసీ మంత్రులేరని ప్రశ్నిస్తోన్న బీజేపీ నేతలు ఈ విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.
మార్పు ఇప్పుడే ప్రారంభమైందని, బీజేపీ నేతలు ఊహించిన దానికంటే ఎక్కువగానే బీసీలకు పదవులు వస్తాయని కౌంటర్ ఇచ్చారు. అలాగే, రాహుల్ కులం ఏంటనీ ప్రశ్నిస్తోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తొలుత దేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన జరపాలని, అప్పుడు రాహుల్ గాంధీ కులం తెలుస్తుందన్నారు. రాహుల్ ఏ పార్టీ వాడు కాదని, ఆయనది ఓపెన్ కాస్ట్ అని చెప్పారు.
ఆమోదిస్తారా? రిజెక్ట్ చేస్తారా? ఏదో ఒకటి చెప్పాలి: మంత్రి సురేఖ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఒక వైపు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూనే.. మతం పేరిట తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఆమోదిస్తారా? లేక రిజక్ట్ చేస్తారా? అనేది ఏదో ఒకటి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకానీ, ఆ బిల్లులను తేల్చకుండా, మతం పేరిట రాజకీయాలు సరికాదని హితవు పలికారు. రాష్ట్ర నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా.. రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదన్నారు.
అడ్డుకుంటే.. మరో ఉద్యమం తప్పదు: మంత్రి వాకిటి
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే.. తెలంగాణ లో జరిగిన సకల జనుల సమ్మెను మించిన ఉద్యమాన్ని చూస్తారని మంత్రి వాకిటి శ్రీహరి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంత సేపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం కాదని.. చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకే విమర్శలు: విప్ ఆది శ్రీనివాస్
బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చాలని పంపిస్తే.. ఆ ఫైల్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ చిత్తశుద్ధిని బీజేపీ నేతలు శంకించడం విడ్డూరంగా ఉందని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీసీల్లో రోజు రోజుకు కాంగ్రెస్ పైపెరుగుతున్న అభిమానాన్ని ఓర్వలేక ఆ రెండు పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నిన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనేత రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం చేసిన కేటీఆర్ టీం.. తాజాగా రాహుల్ సీఎంపై ప్రశంసలు కురిపించగానే తట్టుకోలేకపోతోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే హక్కే లేదన్నారు.