- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓడిపోతున్నామనే అసహనంతో తమ పార్టీ అభ్యర్థిని కించపరిచే రీతిలో మాట్లాడటం సరైంది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పోలింగ్ జరుగుతున్నప్పుడే ఆమె మీడియాతో మాట్లాడటం, తమ అభ్యర్థిపై తీవ్ర ఆరోపణలు చేయడం ముమ్మాటికి ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈ మేరకు మంగళవారం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
క్యాంపెయిన్ ముగిసిన తర్వాత తమ పార్టీకి చెందిన బయటి ప్రాంత నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపించడం లేదని, అలా ఎవరైనా ఉంటే ఎన్నికల సంఘం, పోలీసులు కేసులు నమోదు చేయవచ్చన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రజాస్వామ్యబద్ధంగా, పూర్తి ఎన్నికల నిబంధన మేరకు జరగాలని ఆకాంక్షించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అందులో భాగంగానే తమ వంతు సహకారాన్ని ఎన్నికల సంఘం, పోలీసులకు అందించామని పొన్నం చెప్పారు.
