
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ‘ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తెలియనట్లుంది, ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో విఫలమైన కేంద్రం.. ఇప్పుడు కాంగ్రెస్‌ను బద్నాం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు చేతనైతే ఢిల్లీ వెళ్లి ప్రధాని దగ్గర కూర్చొని తెలంగాణకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించాలని సవాల్ చేశారు. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి.. కేంద్ర మంత్రిని కలిసి ఎరువులు సరఫరా చేయాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. వచ్చిన ఎరువుల స్టాక్ ఎంత ? ఎంత సరఫరా చేశారు ? ఇంకా ఎంత రావాలో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
వ్యవసాయం, రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంటే తెలియని వారు హైదరాబాద్‌లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడతాం అంటే కుదరని అన్నారు. కేంద్రం ఎరువులు సప్లై చేయకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రాష్ట్రానికి సరిపోను ఎరువులు కేటాయించేలా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.