ఆర్టీసీకి మహాలక్ష్మి కళ : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీకి మహాలక్ష్మి కళ :  మంత్రి పొన్నం ప్రభాకర్
  •     మంత్రి పొన్నం ప్రభాకర్ 

హుస్నాబాద్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకం వల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగి లాభాల బాటలోకి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం స్థానిక క్యాంపు ఆఫీస్, అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఆర్టీసీ డిపోలో సీసీ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, బస్టాండ్​లో మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు చెందిన 16 మంది దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. 

అనంతరం  మంత్రి మాట్లాడుతూ.. మేడారం వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఐడెంటిటీ బ్యాండ్లు ఇస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఆఫీసులో అధికారులతో కలిసి 'స్వచ్ఛత ప్రతిజ్ఞ' చేశారు. సీనియర్ జర్నలిస్టు ఫజుల్ రహ్మాన్ జ్ఞాపకార్థం ఏటా 'బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు' ఇవ్వాలని, అందుకు కావాల్సిన నిధులను తానే డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.

పోతారం(ఎస్) గ్రామానికి చెందిన వార్డు మెంబర్ యాదమ్మ మొక్కు మేరకు మంత్రి వారితో కలిసి అమ్మవారికి బంగారం (బెల్లం) సమర్పించారు. ఎల్లమ్మ ఆలయంలో సతీసమేతంగా చండీహోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కరీంగర్ రీజినల్ మేనేజర్ రాజు, హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ చందు, నాయకులు, మంజులరెడ్డి, శివయ్య, రవీందర్, పద్మ, శ్రీనివాస్, రమణ, సరోజన, వెంకటస్వామి తదితరులున్నారు.