
- దుద్దెడ టోల్‌గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు బస్సులో ప్రయాణం
సిద్దిపేట, వెలుగు : ‘ఏమ్మా.. ఎటు పోతున్నరు.. ఫ్రీ బస్సుతో హ్యాపీగానే ఉన్నారా ? ఏమైనా సమస్యలు ఉన్నాయా’ ? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలను పలకరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్‌గేట్ వద్ద తన కాన్వాయ్ దిగి ఆర్టీసీ బస్సు ఎక్కిన మంత్రి సిద్దిపేట కలెక్టరేట్ వరకు బస్సులోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, స్టూడెంట్లతో మాట్లాడారు. మహాలక్ష్మి పథకం కింద అందుతున్న సేవలపై ఆరా తీశారు.
మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి నెల రూ. 330 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే.. తాము కొత్త బస్సులు కొని తెలంగాణకే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దామని చెప్పారు. అనంతరం పలువురు స్టూడెంట్లతో మాట్లాడారు. ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని మహిళలు, స్టూడెంట్లు మంత్రి ఎదుట ఆనందం వ్యక్తం చేశారు.
పేదవారికి పథకాలు అందించడమే లక్ష్యం
పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారినే ఎంపిక చేయాలని సూచించారు. వడ్ల కొనుగోళ్లు త్వరగా జరిగేలా చూడడంతో పాటు వెంటవెంటనే పేమెంట్లు చేయాలని, అకాల వర్షంతో తడిసిన వడ్లను త్వరగా మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
నకిలీ విత్తనాలు చలామణి కాకుండా నిఘా పెట్టాలని చెప్పారు. టెన్త్, ఇంటర్‌లో 90 శాతం పైన మార్కులు సాధించిన స్టూడెంట్లను సన్మానించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు. అనంతరం అక్కన్నపేటలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు హాజరయ్యారు. భూ హక్కుదారుడి ఆత్మగౌరవం కాపాడేలా భూభారతి చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు.