- మంత్రి కొండా సురేఖకు మేమంతా అండగా ఉంటాం : పొన్నం
- ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే శక్తి ఎవరికీ లేదన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు : మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాద్ధాంతం చేయడం ఎందుకని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బలహీనవర్గాల మంత్రిగా ఆమెకు తామంతా అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే శక్తి ఎవరికీ లేదన్నారు. శనివారం గాంధీభవన్ లో మీడియాతో పొన్నం చిట్ చాట్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని ఆయన మండిపడ్డారు. బడ్జెట్తో పాటు వరద సాయంలోనూ నిరాశే ఎదురైందన్నారు.
కేంద్రం తీరుపై బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. కేంద్రం నుంచి రూపాయి తేలేనివారు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసిరావాలి” అని కోరారు.
మహిళలకు చీరలు ఇస్తం..
బతుకమ్మ చీరల విషయంలో మహిళలు ఆందోళన చెందవద్దని, మహిళా సంఘాల్లోని సభ్యులకు చీరలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ‘‘గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు కట్టలేదు. రూ.375 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో రూ.150 కోట్లు విడుదల చేశాం” అని చెప్పారు. ‘‘చాలా గురుకులాలకు సొంత భవనాలు లేవు.
కిరాయి బిల్డింగ్స్ లో హాస్టల్స్ కొనసాగుతున్నాయి. పాములు, దోమలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో చర్చించాను. గ్రీన్ చానెల్ ద్వారా నిధులు కేటాయించాలని కోరాను. వాళ్లు సానుకూలంగా స్పందించారు” అని పేర్కొన్నారు.