రంజాన్​కు అన్ని ఏర్పాటు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

రంజాన్​కు అన్ని ఏర్పాటు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
  • వాటర్, కరెంట్ సప్లైలో అంతరాయం లేకుండా చూడాలి: మంత్రి పొన్నం
  • రంజాన్ నెల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న మొదటి రంజాన్ నెలను ముస్లింలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద వాటర్, కరెంట్​సప్లైలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.

రంజాన్ పండుగ ఏర్పాట్లకు సంబంధించి హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి అయిన పొన్నం ఆధ్వర్యంలో సోమవారం సెక్రటేరియెట్ లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు  ప్రభుత్వ మైనారిటీ సలహాదారు షబ్బీర్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్  మోతె శ్రీలత, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అన్ని కాలనీల్లో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా, అదనంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఓవర్ లోడ్ పడినప్పుడు ఇబ్బందులు లేకుండా మొబైల్ ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు శానిటేషన్ టీమ్స్ ని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు శానిటేషన్ సేవలు పూర్తి చేయాలని చెప్పారు.

ఎంఐఎం ఎమ్మెల్యేలు కోరిన విధంగా రంజాన్ మాసం సందర్భంగా షాపులు 24 గంటలు నడుపుకొనే ప్రతిపాదనను పరిశీలించాలని, పుట్ పాత్ ల పై ఉండే చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులకు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు  మంత్రి పొన్నం  సూచించారు. రంజాన్ పండుగ నిధుల విషయంలో సీఎంతో చర్చిస్తానని ఎంఐఎం ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.