ఆర్టీసీ విలీన ప్రక్రియపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియకు పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్ డిపో పనులను మంత్రి పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
గతంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల మంత్రుల బృందం.. కార్మిక నాయకులతో విలీన ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చలు జరిపిందని గుర్తు చేశారు.
►ALSO READ | మత సామరస్యమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విధానం: మంత్రి పొంగులేటి
ఆర్టీసీలో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని.. ఆ ఎన్నికల్లో గెలిచిన ప్రజాస్వామ్య ప్రతినిధుల అభిప్రాయం మేరకు విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ విలీనానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసిన పొన్నం... కార్మికులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న బస్ డిపో పనులు అత్యంత చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసమే పెద్దపల్లిలో నూతనంగా డిపోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన పెద్దపల్లి జిల్లా ప్రజలకు, రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఈ బస్ డిపోను.. అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు.
