
- ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి
- ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం
- మంత్రి పొన్నం ప్రభాకర్
- ఉమ్మడి జిల్లాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో అమరుల ఆశయాలతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయన్నారు. ఆరోగ్య శ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుకున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. పదేండ్లు ఎదురుచూసిన పేదలకు రేషన్ కార్డులు ఇచ్చామన్నారు.
మహిళా సంఘాలకు రుణాలు, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం, రైతులకు రుణమాఫీ చేసి, రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు ఇచ్చామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. అనంతరం విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ కె.హైమావతి, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, సీపీ అనురాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి తదితరులున్నారు.
మెదక్, వెలుగు: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చారిత్రక మెదక్ ఖిల్లాపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు జాతీయ జెండా ఎగురవేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో, రాందాస్ చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్‌రావు, పవన్, దుర్గాప్రసాద్, రమేశ్, దేవ్లా, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం, వెలుగు: జిన్నారం, గడ్డపోతారం, బొల్లారం మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు తిరుపతి, వెంకటరామయ్య, కిషన్ జెండాలను ఆవిష్కరించారు. జిన్నారం కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ జెండా ఎగురవేశారు. బొల్లారంలో స్వచ్ఛతా హీ సేవ–2025 ర్యాలీని కమిషనర్ కిషన్ ప్రారంభించారు.
తూప్రాన్, వెలుగు: తూప్రాన్ డివిజన్ కేంద్రంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఆర్డీవో ఆఫీస్‌లో ఆర్టీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ గణేశ్ రెడ్డి, తహసీల్దార్ఆఫీస్ లో తహసీల్దార్చంద్రశేఖర్ రెడ్డి, పీఏసీఎస్కార్యాలయంలో చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి జెండాలను ఆవిష్కరించారు.
బెజ్జంకి, వెలుగు: మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్‌లో తహసీల్దార్చంద్రశేఖర్, ఎంపీడీవో ఆఫీస్‌లో ఎంపీడీవో ప్రవీణ్, కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు ముఖ్యస రత్నాకర్ రెడ్డి జాతీయ జెండాలను ఎగురవేశారు.