రవాణా శాఖలో మార్పులు చేసి మెరుగైన సేవలందిస్తం : పొన్నం ప్రభాకర్

రవాణా శాఖలో మార్పులు చేసి మెరుగైన సేవలందిస్తం : పొన్నం ప్రభాకర్
  •     వేగంగా పెరిగిపోతున్న  వాహనాల వాడకం
  •     ప్రయాణం ఎంత ముఖ్యమో..భద్రత కూడా అంతే  
  •     మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఎల్​బీనగర్,వెలుగు :  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో  రవాణా శాఖలో ప్రక్షాళన చేపట్టి సమగ్ర మార్పులు చేయనున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2.15 కోట్ల సీఎస్ఆర్ నిధులతో రామోజీ ఫౌండేషన్ కొత్తగా నిర్మించిన ఆర్టీవో ఆఫీసును గురువారం మంత్రి  ప్రారంభించి మాట్లాడారు. వాహనాల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుందని, 2014లో 71లక్షల ఉంటే.. నేడు కోటి 60 లక్షలు దాటడం చూస్తుంటే..

వాడకం ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రయాణం ఎంత అవసరమో, భద్రత కూడా అంతే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు జర్నీ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 9 కోట్ల జీరో వ్యాల్యూ టికెట్స్ జారీ చేసినట్టు తెలిపారు. సమ్మక్క సారక్క జాతర, ఇతర పండుగలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో  ఫ్రీ జర్నీ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.  కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, జిల్లా రవాణా శాఖ అధికారి ప్రవీణ్ రావు, స్థానిక రవాణా శాఖ అధికారి రఘునందన్ గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి, వైస్ మున్సిపల్ చైర్ పర్సన్ హరిత ధన్ రాజ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

గౌడ్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

గండిపేట : గౌడ్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ఇంటికి గురువారం మంత్రి వెళ్లారు. స్వామి గౌడ్ ఇంటి ముందున్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం మైలార్‌దేవ్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ ఇంటికి పొన్నం వెళ్లిన సందర్భంగా మాట్లాడారు.

ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద గౌడ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. యాదాద్రిలో నిర్మాణం పూర్తయి సేవలు అందిస్తున్నాయన్నారు.  వేములవాడ, శ్రీశైలం ఇలా పలుచోట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. గౌడ సంక్షేమ సంఘాన్ని బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

సిటీలో నీటి కోతలు లేవు

హైదరాబాద్​, వెలుగు :  సిటీలో నీటి సరఫరాలో కోతలు లేవని హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. నీటి కోతలు అంటూ వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. నీటి సరఫరాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని సూచించారు. అవసరమైతే అత్యవసర పంపింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కృష్ణా నుంచి నీటి సరఫరా వ్యవస్థపై ఎలాం టి భయాందోళనలు పెట్టుకోవద్దని మంత్రి ఒకప్రకటనలో హామీ ఇచ్చారు.

కొద్దిపాటి అంతరాయమే...

సిటీలో కరెంట్ కట్ అంటూ వస్తున్న వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. వేసవిలో అధిక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ముందస్తు నిర్వహణ పనుల కారణంగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల నిర్వహణ, మరమ్మతుల పనుల షెడ్యూల్ రూపొందించారని తెలిపారు.

విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అతి నిర్వహణ పనులు పూర్తి చేసేలా క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ లో  విద్యుత్ అధికారులు మరమతులు చేపట్టేవారని, ఈసారి ఎన్నికల కారణంగా లేట్ అయిందని మంత్రి వెల్లడించారు.