
- పంపిణీ నిరంతరంగా కొనసాగుతుంది
- అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు ఇస్తం
- ఉన్న ప్రాంతంలోనే డబుల్బెడ్రూం ఇండ్లిస్తం
- ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రేషన్‌కార్డుల పంపిణీ
హైదరాబాద్‌సిటీ/జూబ్లీహిల్స్/పద్మారావునగర్, వెలుగు : ఆషాఢమాసంలో బోనాల జాతర చేసుకున్న నగరవాసులు.. శ్రావణంలో రేషన్ కార్డుల పండుగ జరుపుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్నియోజక వర్గాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 లక్షల రేషన్ కార్డులు తొలగించారని, పదేండ్లుగా ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని అన్నారు.
బీఆర్‌ఎస్‌పాలనలో ఎన్ని కార్డులు ఇచ్చారో చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కార్డులు వచ్చేవన్నారు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోగానే వెరిఫై చేసి అర్హులకు రేషన్ కార్డులిస్తున్నామని చెప్పారు. గతంలో ఉప్పల్‌లో పని చేస్తున్న వారికి కొల్లూరులో ఉన్న డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించారని, అవి వారికి ఎలా ఉపయోగపడతాయని ప్రశ్నించారు. ఉన్న చోటే ఇల్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
నగరంలో 55,378 కార్డులు ఇస్తున్నాం
హైదరాబాద్ 9 సర్కిళ్ల పరిధిలో కొత్తగా 55,378 రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లబ్ధిదారుల సంఖ్య 23,61,440 నుంచి 27,40,689కు పెరిగిందన్నారు. ఖైరతాబాద్‌లో1,953 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా, 7,435 మంది కొత్తగా లబ్ధిదారులు అయ్యారని తెలిపారు. జూబ్లీహిల్స్ లో 5,500 కొత్త రేషన్ కార్డులిస్తున్నామని,12,276 మంది కొత్తగా లబ్ధిదారులుగా చేర్చామని చెప్పారు. కంటోన్మెంట్‌లో 1,150 కొత్త రేషన్ కార్డులిస్తున్నామని, 4,220 మంది పేర్లు నమోదయ్యాయని తెలిపారు. రేషన్ కార్డు రానివారు దరఖాస్తు చేసుకోవాలని, అర్హత ఉన్నవారందరికీ తప్పకుండా కార్డులు ఇస్తామన్నారు. శనివారం 10 గంటలకు అంబర్‌పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో, మధ్యాహ్నం 12 గంటలకు ముషీరాబాద్ కషిష్ ఫంక్షన్ హాల్, 3 గంటలకు సీతాఫల్ మండిలో కార్డులను అందజేస్తామన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించండి
జూబ్లీహిల్స్ పదేండ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్తెలిపారు, రాబోయే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అవకాశమిస్తే జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణానికి పాలసీ తీసుకువస్తామని చెప్పారు. కలెక్టర్ దాసరి హరిచందన, కంటోన్మెంట్ఎమ్మెల్యే శ్రీగణేశ్, దానం నాగేందర్, అజారొద్దీన్ , నవీన్ యాదవ్, ఆయా నియోజక వర్గాల కార్పొరేటర్లు పాల్గొన్నారు.