
సిద్దిపేట (హుస్నాబాద్), వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి మాటలను బీజేపీ లీడర్లు వక్రీకరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రధాని కులంపై రాజకీయాలు చేస్తూ తెలంగాణలోని బలహీన వర్గాలకు అన్యాయం చేసేలా వ్యవహరించొద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేబినెట్‌లో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తామన్నారు.
దీనికి బీజేపీ మద్దతు ఇస్తుందా ? ఇవ్వదా ? ఈ ప్రతిపాదనను తీసుకెళ్లి పీఎంను ఒప్పిస్తారా ? లేదా ? చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో 100 ఎంపీలతో తీర్మానం చేస్తారేమోనని బీజేపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని పుట్టుకతోనే బీసీ అయితే ఇలాంటి మాటలు అనేవారు కాదన్నారు.
దేశవ్యాప్తంగా సర్వే చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎందరు ఉన్నారో ? బయటివాళ్లు ఎందరు ఉన్నారో ? గుర్తించి వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేందర్‌రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, పార్టీ నేతలు పాల్గొన్నారు.