సిద్దిపేట: నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన చేశారు. నిరుద్యోగులు ఆందోళన చెందొద్దని.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ వస్తుందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంట వెంటనే పూర్తి చేస్తామని.. నిరుద్యోగులంతా పరీక్షల సన్నద్ధతలో ఉండాలని సూచించారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును సందర్శించిన మంత్రి పొన్నం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ పోరాటానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉన్నప్పటికీ వాటినన్నింటిని పరిష్కరించి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో కొన్ని లోపాలున్నాయనే కారణంతో కోర్టు ఒక తీర్పు ఇచ్చిందని.. కోర్టు నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు.
ALSO READ : సింగరేణి బతికించుకోవాలంటే గనులు పెంచుకోవాలి
కానీ కోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీ మొత్తం పరీక్షనే రద్దు చేయాలని కోరుతూ రాక్షాసానందం పొందుతున్నారని.. ఇది దురదృష్టకరమన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడి, వారికి అండగా ఉండి బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తే మంచిదని సూచించారు. ఎక్కడైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.
