బీఆర్ఎస్ హయాం నుంచే నీటి కష్టాలు : మంత్రి పొన్నం

బీఆర్ఎస్ హయాం నుంచే నీటి కష్టాలు : మంత్రి పొన్నం
  •     ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై చర్చకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీనంగర్‌‌లో పంటల పరిశీనలకు వెళ్లడంపై మంత్రి స్పందించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడనే బాధ్యతతో పంట పొలాలు తిరిగిన కేసీఆర్.. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. గతేడాదే భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్లే రైతులకు నష్టం జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం నుంచి దిగే నాటికి ఉన్నప్పుటి, ఇప్పుటి.. నీటి లభ్యత, నిల్వలపై చర్చిద్దామన్నారు. కరువును కాంగ్రెస్ తెచ్చిందని కేసీఆర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల ప్రయోజనాలను కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగనట్లయితే తమతో కలిసి రావాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ ‘నేతన్నల మీద కాంగ్రెస్‌‌కు ఎందుకు ఇంత కక్ష’ అనడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూడు నెలల్లో తాము నేతన్నలపై ఏం కక్ష తీర్చుకున్నామని కేటీఆర్‌‌ను ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ హయాంలోని బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు ఇవ్వక నేతన్నలు ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు చేసిన పాపమే. నేతన్నలకు నిత్యం పని ఉండేలా టెస్కోని పటిష్టం చేస్తూ.. రాష్ట్రంలో అవసరమున్న ప్రతి బట్ట వారి దగ్గరే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నం’ అని మంత్రి అన్నారు. 

సంజయ్​..దీక్షలు మోదీ దగ్గర చెయ్

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌‌ కరీనంగర్‌‌లో తిరుగుతూ.. ఏది పడితే అది మాట్లాడుతున్నారని పొన్నం విమర్శలు గుప్పించారు. ఆయన రైతుల దగ్గర మొసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నారన్నారు. దీక్షలు ఇక్కడ గల్లీలో కాదని, ఢిల్లీలోని మోదీ దగ్గర చేయాలన్నారు.