- రూ.5 వేలు తీసుకొని ఓటెయ్యండని చెప్పడం దుర్మార్గం: మంత్రి పొన్నం
- డబ్బు అహంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రూ.5 వేలు తీసుకొని ఓటెయ్యండంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తరఫున ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటుకు రూ.5 వేలు తీసుకోవాలంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను ఈసీ సీరియస్ గా తీసుకొని సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. పదేండ్ల పాటు అక్రమంగా డబ్బు సంపాదించారని, ఆ డబ్బు అహంతో కేటీఆర్ ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.6 వేలు ఇచ్చిన సంస్కృతి బీఆర్ఎస్ దేనన్నారు.
ఓటుకు రూ.5 వేలు తీసుకోండని కేటీఆర్ చెప్తున్న తీరును చూసి జాలేస్తుందని, ఆ పార్టీ నేతలు ఎంతలా దిగజారి మాట్లాడుతున్నారో ఆయన వ్యాఖ్యలతో అర్థం అవుతున్నదన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచనాపరులని అభివృద్ధి కోసం కాంగ్రెస్ ను గెలిపిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, అందులో భాగంగానే గతంలో మూడంకెల ఓట్లు దాటని వ్యక్తిని బీజేపీ బరిలో నిలిపిందని ఆరోపించారు. ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.
