దమ్ముంటే రాజీనామా చెయ్యాలి.. పొంగులేటికి పువ్వాడ సవాల్

దమ్ముంటే రాజీనామా చెయ్యాలి.. పొంగులేటికి పువ్వాడ సవాల్

ఖమ్మం/ వైరా, వెలుగు : బీఆర్​ఎస్​లో అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డికి వ్యతిరేకంగా జిల్లా బీఆర్ఎస్​ నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలోని సెకండ్​క్యాడర్ ఆయన వైపు వెళ్లకుండా ప్లాన్​చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేస్తూ, కార్యకర్తలతో సమావేశమవుతున్న పొంగులేటి ఈనెల13న వైరా నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని ప్లాన్​ చేశారు. దీన్ని కౌంటర్ చేసేందుకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్​ఎస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించింది. దీనికి మంత్రి అజయ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు హాజరయ్యారు. 

పిల్లి అరుపులు..పిట్ట ఊపుడు...: మంత్రి అజయ్​

మంత్రి అజయ్​ మాట్లాడుతూ పొంగులేటి పేరు ప్రస్తావించకుండానే  దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్​ ను గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ‘పార్టీ నిన్ను బహిష్కరిస్తే సింపతీ నాటకాలు చేయాలని చూస్తున్నావు. నీలాంటి పిల్లి అరుపులకి, పిట్ట ఊపుడికి కేసీఆర్​భయపడే రకం కాదు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ బోళా శంకరుడు. నియోజకవర్గంలో అన్ని ఎన్నికలకు సంబంధించిన బీఫామ్​లు ఎమ్మెల్యేకి ఇచ్చాం. ఆయన అన్ని పదవుల్లో శ్రీనివాసరెడ్డి వర్గీయులకే ప్రాధాన్యతనిచ్చారు. మార్క్​ ఫెడ్ వైస్​ చైర్మన్​ నుంచి సర్పంచ్​ పదవుల వరకు అవకాశమిచ్చారు.

ఎమ్మెల్యే రాములు నాయక్​ చేసిన అన్యాయమేంటి.? ఆయన ఉండగానే మరో వ్యక్తిని వైరా నియోజకవర్గంలో తన అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే బీఆర్ఎస్​కు రాజీనామా చేయాలి. నైతిక విలువలుంటే పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రిజైన్​ చేయాలి’ అన్నారు.  బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ ‘గత ఎన్నికల్లో జిల్లాలోని 10 స్థానాల్లో ఐదు సీట్లు నీ అనుచరులకే ఇస్తే గెలిపించుకోలేకపోయావు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టుకునేందుకు అభ్యర్థుల ఇండ్ల స్థలాలు తాకట్టుపెట్టుకున్న చరిత్ర నీది. 108 ఎకరాల భూమికి ఏటా రూ.10.80 లక్షల రైతుబంధు తీసుకుంటున్నావు. నారాయణపురంలో మామిడితోటకు ఉచిత కరెంటు అందుతోంది’ అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్​కుమార్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.