సాండ్ బజార్తో దళారులకు అడ్డుకట్ట : మంత్రి దామోదర రాజనర్సింహ

సాండ్ బజార్తో దళారులకు అడ్డుకట్ట : మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు: దళారుల జోక్యం లేకుండా ప్రజలకు నేరుగా ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో సాండ్​ బజార్​ఏర్పాటు చేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం అందోల్​ మండలంలోని సంగుపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాండ్ బజార్​ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బయట మార్కెట్​లో రూ. 2600లకు టన్ను ఇసుక దొరుకుతుంది. 

కానీ  సాండ్​ బజార్​ ద్వారా రూ.1200లకే టన్ను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో సాండ్ బజార్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక సరఫరాలో ఎవరైనా దళారులుగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనింగ్ కార్పొరేషన్, రెవెన్యూ, హౌసింగ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇసుక సరఫరాను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. 

అనంతరం ఇసుక తరలింపు వాహనాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా, అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మార్క్​ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, పీఏసీఎస్​చైర్మన్ నరేందర్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.