టెన్త్ ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు

టెన్త్ ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు
  •     డైరెక్టరేట్​లో కంట్రోల్ రూమ్
  •     అధికారులకు మంత్రి సబితారెడ్డి ఆదేశం 
  •     ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జాంలు 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఎగ్జాంలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పొరపాట్లకు తావు లేకుండా ఎగ్జాంలు  నిర్వహించాలని చెప్పారు. సోమవారం టెన్త్ ఎగ్జాంల నిర్వహణపై విద్యాశాఖ సెక్రటరీ సందీప్​కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టర్ శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు, ఇతర అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకూ జరిగే ఎగ్జాంలకు 5,09,275 మంది స్టూడెంట్లు అటెండ్ కానున్నారని, వీరికోసం 2,861 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పారు. ఎగ్జామ్స్ విధుల్లో ఉండే సిబ్బందికి మొబైల్ ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాలను సెంటర్లలోకి అనుమతించకూడదని ఆదేశించారు. ఎగ్జామ్స్ నిర్వహణలో ఏమైన సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించేలా రాష్ట్ర డైరెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఎంఈఓ ఫోన్ నెంబర్లను డిస్​ప్లే చేయాలన్నారు. ఎగ్జాం సెంటర్లలో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయ్​లెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

లీక్ కాకుండా చూడాలె: సుల్తానియా 

టెన్త్ ఎగ్జాంల క్వశ్చన్ పేపర్లు లీక్ కాకుం డా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ఎగ్జాంలపై హైదరాబాద్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల సమయంలో స్టూడెంట్లను, ఇన్విజిలేటర్లను బయటకు రాకుండా చూడాలని, దగ్గర్లోని జిరాక్స్ సెంటర్లను మూసేయాలని పేర్కొన్నారు.