త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

త్వరలోనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని.. అలాగే.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని SYR గార్డెన్ లో ‘బడి బాట’ కార్యక్రమం సమీక్ష సమావేశం జరిగింది. దీనికి మంత్రి సబితా హాజరై మాట్లాడారు. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం వల్ల పెద్దఎత్తున విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ అనిత హరనాథ్ రెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్శింహ రెడ్డి, మీర్ పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్, ఎంపీపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.