- ఏర్పాట్లు చేస్తున్న రైల్వే అధికారులు
- జనవరి రెండో వారంలో ఓపెనింగ్ సన్నాహాలు
- ఏటా మల్లన్న దర్శనానికి లక్షల్లో భక్తుల రాక
- స్టేషన్ అందుబాటులోకి వస్తే తీరనున్న రవాణా ఇబ్బందులు
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. దసరా నాటికే ప్రారంభించాల్సి ఉండగా, పంచాయతీ ఎన్నికలతో వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే జనవరి రెండో వారంలో ఓపెన్ చేసేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేపట్టారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ – కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి వరకు 151 కిలో మీటర్ల రైల్వే లైన్ లో భాగంగా స్టేషన్ నిర్మించారు.
రాజీవ్ రహదారికి సమీపంలో కొండపాక గేట్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో రైల్వే అండర్ పాస్ వద్ద మల్లన్న రైల్వే హాల్ట్ స్టేషన్ ఉంది. స్టేషన్ ప్రారంభమైతే హైదరాబాద్, సికిందరాబాద్ తో పాటు చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ నుంచి వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు తొలగుతాయి. ఏటా కొమురవెల్లి మల్లన్న దర్శనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 25 లక్షల మంది వరకు భక్తులు వస్తుంటారు.
ముఖ్యంగా సంక్రాంతి తర్వాత 3 నెలల పాటు కొనసాగే మహా జాతర కు సుమారు 10 లక్షల మందికి పైగా భక్తులు మల్లన్న దర్శించుకుంటారు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏడాది కింద రూ. 3 కోట్ల నిధులతో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టారు. మహా జాతరకు ముందే స్టేషన్ ప్రారంభిస్తారు.
మల్లన్న చరిత్రను తెలిపేలా ముస్తాబు
కొమురవెల్లికి 3 కిలో మీటర్ల దూరంలో నిర్మించిన రైల్వే స్టేషన్ లో అన్ని సౌకర్యాలను కల్పించారు. అర ఎకరం స్థలంలో రూ. 3 కోట్లతో 400 మీటర్ల పొడవు ఫ్లాట్ ఫామ్ నిర్మించారు. ప్రస్తుతం కొండపాక వైపు మాత్రమే నిర్మించగా.. భవిష్యత్ లో మరో రైల్వే ట్రాక్ నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. స్టేషన్ బిల్డింగ్, వెయి టింగ్ హాల్, షెల్టర్ సీటింగ్, టికెట్ కౌంటర్, ప్యాసింజర్ వెయిటింగ్ హాల్, టికెట్ బుకింగ్ కౌంటర్, టాయి లెట్స్, ప్లాట్ ఫామ్ పనులు పూర్తి అయ్యాయి.
రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే 500 మీటర్ల మెయిన్ రోడ్డు ను ప్రత్యేకంగా సీసీతో నిర్మించారు. రైల్వే స్టేషన్ కాంపౌండ్ వాల్ తో పాటు గదుల్లో సందేశాత్మక చిత్రాల తో పాటు మల్లన్న చరిత్రను తెలిపే చిత్రాలతో అందంగా తీర్చిదిద్దారు. కొద్దిరోజుల కింద దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ సందర్శించి పనులను పరిశీలించారు. ఇటీవల మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. అదేవిధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా మల్లన్న రైల్వే హాల్ట్ స్టేషన్ చిత్రాలను కొద్దిరోజుల కింద ఎక్స్ లో పోస్ట్ చేశారు.
భక్తులు కొమురవెల్లికి రావాలంటే..
మనోహరాబాద్ - కొత్త పల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా టెక్నికల్ కారణాలతో మొదట లకుడారం వద్ద రైల్వే స్టేషన్ ను నిర్మించారు. దీంతో భక్తులు ఆ స్టేషన్ నుంచి కొమురవెల్లికి రావాలంటే 12 కిలో మీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్య ప్రధాన అడ్డంకి మారింది. దీంతో స్థానికులు, భక్తులు రాష్ట్ర , కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
రైల్వే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొమురవెల్లి వద్ద రైల్వే లైన్ స్కిప్పర్ గ్రేడ్ లోకి రావడంతో రైల్వే స్టేషన్ ఏర్పాటు రూల్స్ అడ్డంకిగా మారాయి. దీనిపై టెక్నికల్ కమిటీ ప్రత్యేక పరిశీలన చేసి స్కిప్పర్ గ్రేడ్ లోని ప్రదేశాల్లో స్పెషల్ సేఫ్టి మెజెర్స్ తో హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చింది.
