- తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయాలి: హరీశ్రావు
- జీరో అవర్‌లో సమస్యలను ప్రస్తావించిన పలువురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేహరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. పీఆర్ సీ, సీపీఎస్ నుంచి ఓపీఎస్, రిటైర్ అయిన ఉద్యోగుల సెటిల్ మెంట్ పైసలు కూడా పెండింగ్ లో ఉన్నాయని.. ఈహెచ్ ఎస్ అమలు కావడం లేదని ఆయన గుర్తుచేశారు.
సంతాప తీర్మానం ముగిసిన తరువాత స్పీకర్ ప్రసాద్ కుమార్ జీరో అవర్ ను ప్రకటించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన జీరో అవర్ లో కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నుంచి మొత్తం 35 మంది మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులు 39 మంది ప్రభుత్వ బెనిఫిట్స్ అందక మనోవేదనతో మరణించారని.. తమ ప్రభుత్వ హయాంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే అందరికీ టైంకు డబ్బులు అందించామని ఆయన తెలిపారు.
సిద్దిపేట నుంచి రిటైర్డ్ జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి కలిశారని, అక్టోబర్ 2024లో రిటైర్ అయితే ఇప్పటివరకు ఒక్క రూపాయి రాలేదని తనకు చెప్పారని హరీశ్తెలిపారు. తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరారు. అలాగే, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్లీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందించాలని.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు పంపించిందని హరీశ్ గుర్తుచేశారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత పదేండ్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా 20 వరకు ఇచ్చేవారని విమర్శించారు. ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతినెలా 5 లోపే ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టపడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
జూబ్లీహిల్స్ లో సమస్యలు పరిష్కరించాలి: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. రెండేండ్ల క్రితం సీఎం అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించారని, ఇపుడు అసెంబ్లీలో అడుగుపెట్టానని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించారని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోని కృష్ణానగర్‌లో వర్షాకాలంలో వరదలు వస్తున్నాయని, హై టెన్షన్ విద్యుత్ వైర్లతో పలువురు చనిపోయారని నవీన్ యాదవ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
బూతులు మాట్లాడడమే రాజకీయం అనుకోవద్దు: కాటిపల్లి
ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని, సీఎంను మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని.. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. భాషను దిగజార్చుతున్నారని, ఏకవచనంతో పిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రికార్డుల నుంచి కూడా తొలగించలేని పరిస్థితి ఉందని, బయట మీడియాతో కూడా పలువురు నేతలు తప్పుగా మాట్లాడుతున్నారన్నారు. బూతులు మాట్లాడటమే రాజకీయం అనుకోవడం కరెక్ట్ కాదన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. కాటేపల్లి లేవనెత్తిన అంశం కీలకమైందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న సీనియర్లు కూడా ఇబ్బందిగా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఇది అన్ని పార్టీలో ఉన్న సమస్య అని శ్రీధర్ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో మంత్రులు, తమ ఎమ్మెల్యేలు సైతం గౌరవంగా మాట్లాడుతారని, ఎలాంటి భేషజాలు లేవని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మైక్ కట్
తన నియోజకవర్గంలో రాఘవ కంపెనీ నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ ను పేల్చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డను కూడా బాంబులు పెట్టి పేల్చేరాని కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే స్పీకర్.. కౌశిక్ రెడ్డి మైక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ మాట్లాడారు. తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కర్నాటక, తమిళనాడుకు ప్రత్యేకంగా భవన్ లు ఉన్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం చొరవ చూపి ఏపీ ప్రభుత్వం, టీటీడీ తో మాట్లాడాలని కోరారు.
