- హైకోర్టులో మాగంటి సునీత ఎన్నికల పిటిషన్
హైదరాబాద్, వెలుగు: వాస్తవాలను తొక్కిపెట్టి నామినేషన్ సమర్పించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపొందిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సోమవారం హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడంతోపాటు నామినేషన్ సమయంలో వాస్తవాలను తొక్కిపెట్టారని ఆరోపించారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు తదితరాలను వెల్లడించాల్సి ఉందని తెలిపారు. అలా వెల్లడించని పక్షంలో వారిఎన్నికను రద్దు చేయొచ్చని తీర్పు స్పష్టంగా ఉందన్నారు. అయితే, దీనికి విరుద్ధంగా నవీన్ యాదవ్ తన నేర చరిత్ర వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించలేదని చెప్పారు.
లోపభూయిష్టంగా ఉన్న నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల అధికారికి పలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఇది ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
